విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటం: మంత్రి పొన్నం ప్రభాకర్

దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలతో విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.

23 జులై, 2026 2:57 PM•ByGovardhan Reddy

Share this article

విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటం: మంత్రి పొన్నం ప్రభాకర్

హనుమకొండ (తెలంగాణ), జూలై 22: దేశ భవిష్యత్తును నిర్మించే యువతకు నాణ్యమైన విద్య, పారదర్శకమైన పరీక్షా విధానం, సమాన అవకాశాలు కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, అయితే ఆ బాధ్యతను విస్మరించి విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కిషన్‌పురలో నిర్వహించిన 'ఛాత్రోంకి గూంజ్' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు, యువజన ప్రతినిధులు పాల్గొన్నారు.

మంత్రి మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల రద్దులు, రీ-ఎగ్జామ్స్ వంటి ఘటనలు వరుసగా జరుగుతూ లక్షలాది మంది విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. విద్యార్థులు నెలల తరబడి కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, ప్రశ్నాపత్రాల లీకుల వల్ల వారి కృషి వృథా కావడం బాధాకరమని పేర్కొన్నారు.

NEET-UG 2026 పరీక్ష రద్దుతో దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర అనిశ్చితి నెలకొందని, పరీక్షల నిర్వహణలో లోపాలు పరీక్షా వ్యవస్థ విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేశాయని అన్నారు. ఈ పరిణామాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రశ్నాపత్రాల లీకేజీలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, బాధ్యులపై చర్యలు తీసుకునే బదులు నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా శాంతియుతంగా ఆందోళన చేసిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీతో పాటు ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని కూడా ఆయన ఖండించారు.

పార్లమెంట్‌లో NEET పేపర్ లీకేజీ అంశంపై సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో అనుమానాలను మరింత పెంచుతోందన్నారు. యువత సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని కోరారు.

దేశవ్యాప్తంగా జరుగుతున్న 'ఛాత్రోంకి గూంజ్' కార్యక్రమాల్లో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని పిలుపునిచ్చిన మంత్రి, ప్రశ్నాపత్రాల లీకేజీలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ యువతతో కలిసి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. పారదర్శకమైన, నిష్పక్షపాతమైన, భద్రమైన పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేసి యువత ప్రతిభకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు