2027 Census Phase 2 | దేశవ్యాప్తంగా 2027 జనగణన రెండో దశ ప్రక్రియ ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ దశలో ప్రజలు ఆన్‌లైన్‌లో స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ముఖ్యంగా 1931 తర్వాత తొలిసారిగా జనగణనలో కులానికి సంబంధించిన వివరాలను నమోదు చేయనుండటం విశేషం. అలాగే తల్లిదండ్రుల జనన తేదీ, జన్మస్థలం వంటి వివరాలతో పాటు పాస్‌పోర్టు కలిగిన వారి పాస్‌పోర్టు సంఖ్యను కూడా నమోదు చేసే అవకాశం ఉంది. ఆధార్ సంఖ్యను మాత్రం స్వచ్ఛందంగా ఇవ్వొచ్చు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. లడఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని మంచు ప్రాంతాల్లో రెండో దశ జనగణన సెప్టెంబరు 1 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. దీనికి ముందు ఆగస్టు 17 నుంచి 30 వరకు ప్రజలు ఆన్‌లైన్ ద్వారా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇందుకోసం ప్రశ్నావళిని త్వరలో విడుదల చేయనున్నారు.
కులగణన
జనగణనలో వ్యక్తి తాను చెప్పిన కులాన్నే నమోదు చేయనున్నారు. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) కోసం ప్రత్యేక డ్రాప్‌డౌన్ జాబితా అందుబాటులో ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ పరిధిలోకి రాని వారికి మాత్రమే ప్రత్యేకంగా ‘కులం’ అనే కాలమ్‌లో వివరాలు నమోదు చేస్తారు. జనగణన జరుగుతున్న రాష్ట్రానికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ జాబితా మాత్రమే డ్రాప్‌డౌన్‌లో కనిపిస్తుంది. వ్యక్తి చెప్పిన కులాన్నే నమోదు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర కులాలకు చెందినట్లు నిరూపించేందుకు ఎలాంటి కుల ధ్రువీకరణ పత్రం, ఇతర పత్రాలు చూపాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 2011 సామాజిక-ఆర్థిక, కుల జనగణనలో ప్రజలు స్వయంగా తమ కులాలను పేర్కొనడంతో 45 వేలకుపైగా కులాల పేర్లు నమోదయ్యాయి. అంత పెద్ద డేటాను వర్గీకరించడం, విశ్లేషించడం సవాలుగా మారిందని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈసారి డిజిటల్ సాంకేతికతతో పాటు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ఆ సమాచారాన్ని సులభంగా క్రమబద్ధీకరించి వర్గీకరించగలమని అధికారులు భావిస్తున్నారు.
తల్లిదండ్రుల జనన వివరాలు ఎందుకు?
రెండో దశ జనగణనలో తొలిసారిగా తల్లిదండ్రుల జనన తేదీ, జన్మస్థలం వివరాలను కూడా సేకరించనున్నారు. పౌరసత్వానికి సంబంధించిన ప్రాథమిక సమాచారంగా వీటిని పరిగణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2011 జనగణనతో పాటు జాతీయ జనాభా నమోదు (ఎన్‌పీఆర్) ప్రక్రియను కూడా చేపట్టారు. 2021 జనగణనతో మరోసారి నిర్వహించాలని భావించినా అది వాయిదా పడింది. ప్రస్తుతం ఎన్‌పీఆర్‌ను 2027 జనగణన నుంచి వేరు చేశారు. 2010లో నిర్వహించిన ఎన్‌పీఆర్‌లో కూడా పౌరసత్వానికి సంబంధించిన వివరాలు సేకరించినప్పటికీ, వాటి ఆధారంగా పౌరసత్వ హక్కులు కల్పించబోమని అప్పుడే స్పష్టం చేశారు. అయితే, తల్లిదండ్రుల జనన తేదీ, జన్మస్థలానికి సంబంధించి ఎలాంటి ధ్రువపత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని అధికార వర్గాలు తెలిపాయి. వ్యక్తికి తెలిసినంత వరకు చెప్పిన సమాచారాన్నే నమోదు చేస్తారు. ఒకవేళ పూర్తి జనన తేదీ తెలియకుండా జన్మించిన సంవత్సరం మాత్రమే తెలిసి ఉంటే, ఆ సంవత్సరంలోని జనవరి 1ని పుట్టిన తేదీగా నమోదు చేసే విధానాన్ని అనుసరించనున్నారు.




















