న్యూఢిల్లీ, ఆగస్టు 8 (జనవాణి): మీ ఇంట్లో ఫార్చూన్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. ప్రముఖ ‘ఫార్చూన్’ బ్రాండ్ వంట నూనెల తయారీ సంస్థ AWL అగ్రి బిజినెస్ లిమిటెడ్ కంపెనీకి భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) జరిమానా విధించింది. సంస్థ తయారు చేసి విక్రయించిన ఫోర్టిఫైడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ నమూనా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేదని పరీక్షల్లో తేలడంతో ఈ చర్యలు చేపట్టింది.
అసలేం జరిగింది?
గోవాలోని తాజ్ ఫోర్ట్ అగ్వాడా రిసార్ట్ అండ్ స్పా నుంచి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు ‘ఫార్చూన్ ఫ్రయోలా’ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ సీడ్ ఆయిల్ ఒక లీటర్ ప్యాక్ నమూనాను సేకరించారు. ఆ నమూనాను పరీక్షలకు పంపించగా.. ఫోర్టిఫైడ్ ఎడిబుల్ ఆయిల్‌కు సంబంధించి నిర్దేశించిన ప్రమాణాలను అది అందుకోలేదని ప్రాథమిక ఆహార ప్రయోగశాల గుర్తించింది. ముఖ్యంగా విటమిన్ ఏ, విటమిన్ డీ స్థాయులు నిర్దేశిత పరిమితుల కంటే తక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. దీంతో ఆ ఉత్పత్తిని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 ప్రకారం నాసిరకం ఉత్పత్తిగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తించింది.
మరోసారి పరీక్షించినా అదే ఫలితం
అయితే ప్రాథమిక పరీక్షల ఫలితాలను కంపెనీ సవాల్ చేసింది. దీంతో నమూనాను రెఫరల్ ల్యాబొరేటరీలో మరోసారి పరీక్షించారు. అక్కడ కూడా విటమిన్ డీ పరిమాణం నిర్దేశించిన స్థాయి కంటే గణనీయంగా తక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చింది. అనంతరం గోవా అడ్జుడికేటింగ్ అధికారి విచారణ చేపట్టి.. ప్రమాణాలకు అనుగుణంగా లేని ఫోర్టిఫైడ్ ఎడిబుల్ ఆయిల్‌ను తయారు చేసి, మార్కెటింగ్ చేసినందుకు AWL అగ్రి బిజినెస్ లిమిటెడ్‌పై జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కంపెనీపై జరిమానా విధించినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెల్లడించినప్పటికీ.. జరిమానా మొత్తాన్ని మాత్రం బయటపెట్టలేదు. ఈ విషయాన్ని ఆహార నియంత్రణ సంస్థ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.





















