కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం కాంగ్రెస్ నేతగా ఉన్న కన్నన్ గోపీనాథన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2019లో సమర్పించిన తన ఐఏఎస్ రాజీనామా ఇప్పటికీ ఆమోదం పొందలేదని పేర్కొంటూ, "ఇప్పుడు రాజీనామాలు ఆమోదించడం ప్రారంభించారు కాబట్టి దయచేసి నాదీ ఆమోదించండి.. ఏడేళ్లు అయింది" అని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
2012 బ్యాచ్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథన్, 2019లో తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతూ స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేయలేకపోతున్నాననే కారణంతో అప్పట్లో రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు.
తాజాగా ఎక్స్ (X) వేదికగా చేసిన పోస్టులో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ, "ఇప్పుడు మీరు రాజీనామాలు ఆమోదించడం ప్రారంభించారు. దయచేసి నా రాజీనామాను కూడా ఆమోదించండి. ఏడేళ్లు అవుతోంది" అని వ్యాఖ్యానించారు. ఇటీవల కేంద్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు.
Loading Tweet...
నెటిజన్లతో ఆసక్తికర సంభాషణ
ఆయన పోస్టుపై స్పందించిన ఓ నెటిజన్, "రాజీనామా ఆమోదం కాలేదంటే ఇప్పటికీ ప్రభుత్వం జీతం చెల్లిస్తుందా?" అని ప్రశ్నించగా, "లేదు. జీతం లేదు, సస్పెన్షన్ లేదు. నా రాజీనామా అలాగే పెండింగ్‌లో ఉంది" అని గోపీనాథన్ సమాధానమిచ్చారు.
మరోకరు "ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తే బహుశా స్పందన రావచ్చు" అని వ్యాఖ్యానించగా, దానికి కూడా ఆయన వ్యంగ్యంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఎందుకు రాజీనామా చేశారు?
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370 రద్దు అనంతరం అక్కడ అమలు చేసిన పరిమితులపై తనకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని కన్నన్ గోపీనాథన్ గతంలో పలుమార్లు చెప్పారు. కమ్యూనికేషన్ సేవల నిలిపివేత, ప్రజాప్రతినిధులు, మాజీ ముఖ్యమంత్రుల నిర్బంధం వంటి చర్యలపై ప్రజాస్వామ్య పరంగా ప్రశ్నలు లేవనెత్తానని ఆయన పేర్కొన్నారు.
అలాగే 2018లో కేరళ వరదల సమయంలో స్వచ్ఛంద సేవలు అందించడం, 2019లో పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై నిరసనల్లో పాల్గొనడం ద్వారా కూడా ఆయన వార్తల్లో నిలిచారు.
రాజీనామా ఇంకా పెండింగ్‌లోనే
గోపీనాథన్ రాజీనామాపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు తుది నిర్ణయం ప్రకటించలేదు. ఈ ఏడాది వెలువడిన కొన్ని మీడియా కథనాల ప్రకారం, ఆయన రాజీనామా ప్రతిపాదన ఇంకా కేంద్ర హోంశాఖ స్థాయిలోనే పెండింగ్‌లో ఉందని, తుది ఆమోదం కోసం సిబ్బంది, శిక్షణ విభాగం (DoPT)కు పంపాల్సి ఉందని అధికార వర్గాల సమాచారం అని పేర్కొన్నాయి.
2025లో గోపీనాథన్ మాట్లాడుతూ, రాజీనామా చేసిన రెండు నెలల తర్వాత తనపై విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ప్రభుత్వాన్ని విమర్శించడం వంటి ఆరోపణలతో శాఖాపరమైన చర్యలు ప్రారంభించారని తెలిపారు. ఆ ప్రక్రియ ముగిసినా, తన రాజీనామాపై మాత్రం ఇంకా నిర్ణయం వెలువడలేదని పేర్కొన్నారు.
తనతో పాటు 2019లో రాజీనామా చేసిన మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ రాజీనామాను 2022లో కేంద్రం ఆమోదించిందని గోపీనాథన్ గుర్తు చేశారు. ప్రస్తుతం శశికాంత్ సెంథిల్ కాంగ్రెస్ పార్టీ తరఫున తమిళనాడులో లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
జమ్మూకశ్మీర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైసల్ కేసు కూడా చర్చకు వచ్చింది. ఆయన రాజీనామా పెండింగ్‌లో ఉన్న సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించి, అనంతరం తిరిగి ప్రభుత్వ సేవలో చేరారు. అలాగే మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై రాజీనామా మాత్రం అదే ఏడాది ఆమోదం పొందింది.




















