గుజరాత్, సెప్టెంబర్ 9 (జనవాణి): రోడ్డు ప్రమాదంగా భావించిన ఓ యువతి మృతి కేసులో పోలీసులు సంచలన విషయాన్ని బయటపెట్టారు. 26 రోజుల క్రితం బైక్ ప్రమాదంలో యువతి మృతి చెందగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు అది యాక్సిడెంట్ కాదని, పక్కా ప్లాన్‌తో జరిగిన హత్య అని నిర్ధారించారు. పరువు కోసం కన్నతండ్రి, సోదరుడే యువతిని హత్య చేసినట్లు తేల్చారు.
అహ్మదాబాద్‌కు చెందిన సోఫియా అనే యువతికి సంబంధించిన ఓ వీడియో మూడు నెలల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో ఆమె తండ్రి మహ్మద్ ఫరూఖ్, సోదరుడు మహ్మద్ హాబిల్ కంటపడింది. దీంతో కుటుంబ పరువు పోతుందని భావించిన వారు సోఫియాపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చివరకు ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఆగస్టు 12 రాత్రి సోఫియాను హాబిల్ బైక్‌పై ఊరి బయటకు తీసుకెళ్లాడు. గెల్జీపుర గ్రామం సమీపంలోని మట్టి రోడ్డులోకి బైక్‌ను తీసుకెళ్లిన అనంతరం హాబిల్ ఇనుప రాడ్డుతో సోఫియా తలపై మూడు సార్లు బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను తండ్రీకొడుకులు ప్రధాన రహదారిపైకి తీసుకొచ్చారు. అక్కడ బైక్‌ను ధ్వంసం చేసి గుర్తుతెలియని వాహనం తమ బైక్‌ను ఢీకొట్టిందని నమ్మించే ప్రయత్నం చేశారు. అనంతరం హాబిల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ప్రమాదం జరిగినట్లు ఫిర్యాదు చేశాడు. తనకు స్వల్ప గాయాలయ్యాయని, సోఫియాకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులకు తెలిపాడు. మాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సోఫియాను సోలా సివిల్ ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ఆమె మరుసటి రోజు ప్రాణాలు కోల్పోయింది.
మొదట పోలీసులు హిట్ అండ్ రన్ కేసుగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే దర్యాప్తులో లభించిన ఆధారాలు, ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలించడంతో అనుమానాలు తలెత్తాయి. చివరకు సోఫియా తండ్రి, సోదరుడే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. పరువు పేరుతో కన్న కూతురినే హత్య చేసిన తండ్రి, సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదంగా చిత్రీకరించిన ఈ కేసులో 26 రోజుల తర్వాత అసలు నిజం బయటపడటం స్థానికంగా సంచలనంగా మారింది.




















