జార్ఖండ్,ఆగస్టు 10 (జనవాణి): జార్ఖండ్‌లో పరీక్షలు, నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) మాజీ చైర్‌పర్సన్ ఎల్. ఖియాంగ్తేను సోమవారం అరెస్ట్ చేసినట్లు జార్ఖండ్ సీఐడీ వెల్లడించింది. జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ పరీక్షపై పూర్తి స్థాయి స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, ఉద్యోగార్థులు రాంచీలో ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ అరెస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటికే 19 మంది అరెస్ట్
మరోవైపు జార్ఖండ్‌లో నియామక ప్రక్రియలో కుంభకోణం జరిగిందనే ఆరోపణలపై ఆ రాష్ట్ర సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ఇప్పటివరకు 19 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఎల్. ఖియాంగ్తేను జూలై 28 నుంచి ఇప్పటివరకు నాలుగు సార్లు విచారించినట్లు సమాచారం. తాజాగా మరోసారి విచారణ అనంతరం అరెస్ట్ చేసినట్లు సీఐడీ ప్రకటించింది.
17వ రోజుకు చేరిన విద్యార్థుల ఆందోళన
జార్ఖండ్‌లో పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, ఉద్యోగార్థులు చేపట్టిన ఆందోళన 17వ రోజుకు చేరుకుంది. అయితే పరీక్షలలో చోటుచేసుకున్న అక్రమాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వేలాది మంది ఉద్యోగార్థులు సోమవారం రాంచీలోని రాష్ట్ర అసెంబ్లీ వైపు భారీ ర్యాలీగా బయలుదేరారు. తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జేఎల్‌కేఎం నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో కూడా అంబులెన్స్‌లో ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ చిత్రపటాన్ని చేతబట్టుకుని కనిపించారు.
అసెంబ్లీ వైపు ర్యాలీ.. పోలీసుల అడ్డంకులు
ప్రస్తుతం జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండటంతో పాటు నేడు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జన్మదినం సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ వైపు వెళ్లే మార్గాల్లో ముళ్ల కంచెలతో కూడిన బారికేడ్లు ఏర్పాటు చేశారు. ర్యాలీ జగన్నాథ్‌పూర్ ఆలయం వద్దకు చేరుకున్న సమయంలో పోలీసులు వాటర్ కెనాన్‌లు ప్రయోగించారు. దీంతో నిరసనకారులు త్రివర్ణ పతాకాలు చేతబట్టి నినాదాలు చేస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు బారికేడ్లను దాటి అసెంబ్లీకి చేరుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు గాయపడ్డామని ఆరోపించారు.
చర్చలు విఫలం.. డిమాండ్లపై భిన్న వాదనలు
ప్రభుత్వం నిరసనకారులతో పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికి... అవి ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. చివరి దఫా చర్చల అనంతరం తమ డిమాండ్లలో 98 శాతం అంగీకరించామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే తాము రద్దు చేయాలని డిమాండ్ చేసిన 13 పరీక్షల్లో కేవలం మూడు పరీక్షలను మాత్రమే రద్దు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రభుత్వం, ఆందోళనకారుల మధ్య వివాదం ఇంకా కొనసాగుతోంది. పరీక్షల అక్రమాలపై స్వతంత్ర విచారణ, నియామక ప్రక్రియలో పారదర్శకత, పరీక్షల రద్దు వంటి అంశాలపై విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.
Loading Tweet...




















