కింగ్ కోబ్రాను చూస్తేనే చాలామంది భయంతో దూరంగా వెళ్లిపోతారు. అలాంటి అత్యంత విషపూరితమైన పాము ముందు ఓ చిన్నారి నిర్భయంగా డ్యాన్స్ చేస్తూ, దానిని కవ్వించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటన ఈశాన్య భారతంలోని ఓ పర్వత ప్రాంత గ్రామంలో జరిగినట్లు తెలుస్తోంది. వీడియోలో తనకంటే పొడవుగా ఉన్న భారీ కింగ్ కోబ్రా వద్దకు వెళ్లిన చిన్నారి తొలుత పామును తట్టి లేపింది. దీంతో కోబ్రా ఒక్కసారిగా ఆమెపైకి దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే బాలిక వేగంగా పక్కకు తప్పించుకుని ప్రమాదం నుంచి బయటపడింది. అనంతరం తనను పాము పట్టుకోలేదన్నట్లుగా దాని ముందు నిర్భయంగా డ్యాన్స్ చేస్తూ కవ్వించింది. అంతటితో ఆగకుండా చివర్లో కింగ్ కోబ్రా తోకను పట్టుకుని పైకి ఎత్తడం కూడా వీడియోలో కనిపించింది.
ఈ దృశ్యాలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బాలిక డ్యాన్స్ పాముకు నచ్చి ఉండొచ్చని కొందరు సరదాగా కామెంట్లు చేయగా, మరికొందరు ఆ పాము కుటుంబం సంరక్షణలో ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ తరహా సాహసాలు అత్యంత ప్రమాదకరమని వన్యప్రాణి నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాము ఎంత ప్రశాంతంగా కనిపించినా ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పలేమని, ముఖ్యంగా పిల్లలు విషసర్పాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వైరల్ వీడియో వినోదంగా కనిపించినప్పటికీ.. పాములతో ఇలాంటి ప్రయోగాలు ప్రాణాలకే ముప్పుగా మారే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Loading Tweet...




















