నీట్ ప్రశ్నపత్నం లీక్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపి, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినా.. పేపర్ లీక్‌లకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా బిహార్‌లోని పట్నా యూనివర్సిటీ నిర్వహించిన ఎల్ఎల్‌బీ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం వాట్సాప్‌లో లీకవ్వడం మరోసారి పరీక్షల నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఎల్‌ఎల్‌బీ ఎంట్రన్స్ కోసం పట్నా యూనివర్సిటీ శనివారం పరీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ విద్యార్థి మొబైల్ ఫోన్‌ను పరీక్ష హాలులోకి తీసుకెళ్లి.. క్వశ్చన్ పేపర్ ఫొటో తీసి, వాట్సాప్‌లో బయటకు పంపించాడు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగగా.. మధ్యాహ్నం 12.02 గంటలకు క్వశ్చన్ పేపర్ సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ పేపర్ లీక్ ఘటనపై పట్నా యూనివర్సిటీ అధికారులు స్పందించారు. పరీక్షా కేంద్రంలోని జామర్లు పనిచేయకపోవడం వల్లనే ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. పేపర్ వాట్సాప్‌లో ప్రత్యక్షమైందన్న సమాచారం తెలిసిన వెంటనే జామర్లను తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు. అయితే ప్రశ్నపత్రం బయటకు వెళ్లినప్పటికీ.. దానికి సంబంధించిన సమాధానాలు మాత్రం పరీక్షా కేంద్రంలోని అభ్యర్థులకు చేరలేదని పేర్కొన్నారు. అందువల్ల పరీక్షను రద్దు చేసేది లేదని స్పష్టం చేశారు.
పరీక్షా కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు, తనిఖీలు ఉన్నప్పటికీ విద్యార్థి మొబైల్‌ను ఎలా తీసుకెళ్లాడన్న దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రశ్నపత్రాన్ని వైరల్ చేసిన విద్యార్థి పరారైనట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సదరు విద్యార్థిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎగ్జామ్ కంట్రోలర్ ప్రొఫెసర్ బీకే లాల్ తెలిపారు.





















