లైంగిక దాడి కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఆయన వద్ద స్మార్ట్‌ఫోన్, పెన్‌డ్రైవ్ లభించడం కలకలం రేపుతోంది. జైలులో ప్రజ్వల్ రేవణ్ణ అక్రమంగా మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందడంతో క్రైంబ్రాంచ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆయన వద్ద నుంచి స్మార్ట్‌ఫోన్‌తో పాటు పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
జైలులో నిషేధిత ఎలక్ట్రానిక్ పరికరాలను అక్రమంగా తీసుకెళ్లి వినియోగించిన ఆరోపణలపై భారతీయ న్యాయ సంహిత (BNS), జైళ్ల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదు చేశారు. ఫోన్, పెన్‌డ్రైవ్ రేవణ్ణ వద్దకు ఎలా చేరాయి? వాటిని ఎవరు అందించారు? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
జైలు అధికారులపై చర్యలు
కట్టుదిట్టమైన భద్రత ఉండే జైలులోకి స్మార్ట్‌ఫోన్, పెన్‌డ్రైవ్ ఎలా చేరాయన్న అంశంపై కర్ణాటక హోంశాఖ సీరియస్‌గా స్పందించింది. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్ నుంచి ఎవరెవరితో మాట్లాడారు? ఏమైనా సమాచారం పంపించారా? అనే విషయాలను తెలుసుకునేందుకు కాల్ డేటా రికార్డులు, ఇతర డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో జైలు సిబ్బంది ప్రమేయం ఉందా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. ఈ క్రమంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ సీనియర్ జైలు అధికారిని సైతం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే జైలు సూపరింటెండెంట్ కుమార్‌కు సైతం షోకాజ నోటీసులు జారీ చేశారు అధికారులు.
ప్రజ్వల్ రేవణ్ణకు యావజ్జీవ శిక్ష
2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కర్ణాటక రాజకీయాల్లో హాసన్ సెక్స్ కుంభకోణం తీవ్ర కలకలం రేపింది. ప్రజ్వల్ రేవణ్ణపై పలువురు మహిళలు లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలు చేశారు. ఈ కేసుల దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. దర్యాప్తు అనంతరం అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణ దోషిగా తేలడంతో కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అప్పటి నుంచి ఆయన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇకపోతే ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ మనవడు కావడం గమనార్హం. జేడీఎస్ మాజీ ఎంపీ అయిన ప్రజ్వల్ రేవణ్ణ జైలులో స్మార్ట్‌ఫోన్, పెన్‌డ్రైవ్‌తో పట్టుబడటం కర్ణాటకలో మరోసారి రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.




















