స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగినా మొబైల్ డేటాను పెద్దగా ఉపయోగించని వారు, ఫీచర్ ఫోన్లు వాడేవారు ఇప్పటికీ కోట్లలో ఉన్నారు. అలాంటి వినియోగదారులకు ప్రయోజనం కల్పించేలా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక మార్పులు చేసింది.
ఇకపై టెలికాం సంస్థలు వాయిస్ కాలింగ్, SMS సేవలు మాత్రమే ఉండే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. డేటా అవసరం లేని వినియోగదారులు తప్పనిసరిగా డేటా కలిగిన ప్లాన్లకు డబ్బు చెల్లించాల్సిన పరిస్థితిని తగ్గించడమే ఈ మార్పుల ఉద్దేశం.
అన్ని వ్యాలిడిటీల్లో వాయిస్, SMS ప్లాన్లు
TRAI తాజాగా టెలికాం కన్స్యూమర్ ప్రొటెక్షన్ (13వ సవరణ) రెగ్యులేషన్, 2026ను జారీ చేసింది. దీని ప్రకారం వాయిస్, SMS సేవలు మాత్రమే ఉండే స్పెషల్ టారిఫ్ వోచర్లు (STVs) వివిధ కాలవ్యవధుల్లో అందుబాటులో తీసుకురావాలని ఆదేశించింది. 30 రోజులు లేదా అంతకంటే తక్కువ వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లను కూడా అందించాలని స్పష్టం చేసింది. అలాగే ప్రతి నెలా ఒకే తేదీన రెన్యువల్ చేసుకునే విధంగా వాయిస్, SMS ప్లాన్లను అందుబాటులో ఉంచాలని TRAI పేర్కొంది. దీంతో వినియోగదారులు తమ అవసరాలకు, బడ్జెట్‌కు అనుగుణంగా రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
విస్తృత సంప్రదింపుల తర్వాత నిర్ణయం
వాయిస్, SMS ఆధారిత ప్లాన్లపై TRAI గతంలో సంప్రదింపుల ప్రక్రియ చేపట్టింది. సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించడంతో పాటు ఓపెన్ హౌస్ డిస్కషన్ నిర్వహించింది. మొత్తం 1,132 మంది తమ అభిప్రాయాలను వెల్లడించిన అనంతరం తాజా నిబంధనలను తీసుకొచ్చింది. TRAI పరిశీలనలో వాయిస్, SMS ప్రయోజనాలు మాత్రమే కోరుకునే వినియోగదారులకు అందుబాటులో ఉన్న ప్లాన్లు పరిమితంగా ఉన్నట్లు గుర్తించింది. ముఖ్యంగా అధిక వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లే ఎక్కువగా ఉండటంతో తక్కువ వినియోగం చేసే కస్టమర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంది.
టెలికాం కంపెనీలు ఏం చేయాలి?
TRAI ఆదేశాల మేరకు టెలికాం కంపెనీలు తమ ప్రస్తుత టారిఫ్ పోర్ట్‌ఫోలియోను పునఃసమీక్షించాలి. కొత్త వాయిస్-ఓన్లీ, SMS-ఓన్లీ లేదా వాయిస్+SMS ప్లాన్లను తమ వెబ్‌సైట్లు, యాప్స్, ఇతర రీఛార్జ్ ప్లాట్‌ఫారమ్‌లలో నిర్ణీత గడువులోగా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం ముఖ్యంగా ఫీచర్ ఫోన్ వినియోగదారులు, సీనియర్ సిటిజన్లు, డేటా అవసరం లేని వారు, కేవలం ఇన్‌కమింగ్-అవుట్‌గోయింగ్ కాల్స్ కోసం మొబైల్ ఉపయోగించే వారికి ఉపయోగపడే అవకాశం ఉంది.
Loading Tweet...




















