పూణే, ఆగస్టు 9 (జనవాణి): మహారాష్ట్రలోని పూణే జిల్లా బరామతి ఎయిర్‌ఫీల్డ్‌లో శిక్షణ విమానానికి సంబంధించిన రన్‌వే ఎక్స్‌కర్షన్ ఘటన చోటుచేసుకుంది. శిక్షణ విన్యాసాల సమయంలో విమానం రన్‌వేపై పూర్తిగా ఆగకపోవడంతో ముందుకు దూసుకెళ్లి రన్‌వేను దాటి కుడివైపు వెళ్లిందని పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ తెలిపారు.
ఆయన వివరాల ప్రకారం.. VT-SEX రిజిస్ట్రేషన్ కలిగిన శిక్షణ విమానంలో కెప్టెన్ చిరాగ్ శశికాంత్ దోయ్‌ఫోడే, క్యాడెట్ అభిజీత్ జుంద్రే ఉన్నారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. విమానం తొలుత లింక్ బ్రావో ద్వారా రన్‌వేపైకి ప్రవేశించి రన్‌వే-29 వద్ద రిజెక్టెడ్ టేకాఫ్ (టేకాఫ్‌ను మధ్యలో నిలిపివేసే శిక్షణ) నిర్వహించింది. అనంతరం రన్‌వే-11 వద్ద మరోసారి అదే విన్యాసం చేపట్టింది.
ఈ క్రమంలో రెండో రిజెక్టెడ్ టేకాఫ్ అనంతరం విమానాన్ని రన్‌వేపై పూర్తిగా నిలిపివేయలేకపోయారు. దీంతో అది రన్‌వే-29 చివరి భాగాన్ని దాటి ముందుకు వెళ్లి, అనంతరం రన్‌వేకు కుడివైపున ఉన్న పేవ్‌మెంట్‌ను దాటి బయటకు వెళ్లింది.
ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.
Loading Tweet...




















