దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన "ఛలో పార్లమెంట్" పిలుపుతో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పాత్రికేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన ధర్నాను ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌డబ్ల్యూజే) నాయకులు, ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు మారూఫ్ రజా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మారూఫ్ రజా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. దేశంలోని పాత్రికేయుల హక్కులు, సంక్షేమం కోసం తెలంగాణ జర్నలిస్టులు ఢిల్లీలో పార్లమెంట్ సమీపంలో ఆందోళన చేపట్టడం అభినందనీయమని అన్నారు.
పోరాటం కొనసాగుతుందన్న టీడబ్ల్యూజేఎఫ్
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి పాత్రికేయుడి హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అందజేశారు.
ప్రధాన డిమాండ్లు:
* జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్‌ల పునరుద్ధరణ
* రిటైర్డ్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ పథకం అమలు
* జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావడం
* నేషనల్ మీడియా కమిషన్ ఏర్పాటు
* జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు పునఃసమీక్ష
ఈ నిరసన కార్యక్రమానికి పలు రాష్ట్రాల నుంచి వచ్చిన జర్నలిస్టులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఉపాధ్యక్షుడు లియాఖత్, సభ్యులు మాన్విక మిశ్రా, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్, రాష్ట్ర నాయకులు కుంచం శ్రీనివాస్, కుడుతాడి బాపురావు, కే. రమాదేవి, జగదీశ్వర్, పద్మనాభరావుతో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.




















