ముంబై: NEET-UG 2026 పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో ముంబైలో చోటుచేసుకున్న ఓ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. పోలీసుల అదుపులోకి తీసుకున్న నిరసనకారులను తరలిస్తున్న వ్యాన్ ముందు ఓ యువతి నిలబడిన వీడియో కోట్లాది మంది దృష్టిని ఆకర్షించింది. ఆ యువతి మరెవరో కాదు.. రియా అహిర్.
27 ఏళ్ల రియా అహిర్ ముంబైకి చెందిన మోడల్, నటి, వ్యాపారవేత్త. ఫ్యాషన్ రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు 'రియాసత్' పేరుతో ఓ దుస్తుల బ్రాండ్ కూడా ఉంది. ఇప్పటివరకు వినోద రంగంలోనే ఎక్కువగా కనిపించిన రియా.. ఒక్క నిరసనతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అనుకోకుండానే.. వైరల్
జూలై 22న ముంబైలో జరిగిన NEET పేపర్ లీక్ నిరసనలో పోలీసులు కొందరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని వ్యాన్‌లోకి ఎక్కించారు. ఆ సమయంలో వ్యాన్ ముందుకు వెళ్లిన రియా, విద్యార్థులను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు. అనంతరం వ్యాన్ ముందే నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది.
తర్వాత మీడియాతో మాట్లాడిన రియా.. పోలీసుల చర్య తనను కలిచివేసిందని చెప్పారు. "పోలీసులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే.. పౌరులుగా మేమే మా బాధ్యత నిర్వర్తిస్తాం" అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్య కూడా తప్పేనని ఆమె అభిప్రాయపడ్డారు.
తాను NEET అభ్యర్థిని కాదని, విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకే నిరసనలో పాల్గొన్నానని రియా స్పష్టం చేశారు. వ్యాన్ ముందు నిలబడటం ముందుగా ప్లాన్ చేసిందే కాదని, అక్కడ పరిస్థితిని చూసి సహజంగానే ఆ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కుమార్తె
తాజాగా మరో ఇంటర్వ్యూలో రియా తన నేపథ్యాన్ని కూడా వెల్లడించారు. తాను రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కుమార్తెనని, దేశం కోసం నిలబడాలనే భావన చిన్నప్పటి నుంచే తనలో ఉందని చెప్పారు. తన తండ్రి కూడా నిరసనలో పాల్గొనడాన్ని పూర్తిగా సమర్థించారని పేర్కొన్నారు.
వ్యాన్‌ను అడ్డుకునే సమయంలో పోలీసుల వద్ద నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు అవసరమైన పత్రాలు (మెమో) ఉన్నాయా అని ప్రశ్నించానని, స్పష్టమైన సమాధానం రాకపోవడంతో వెంటనే వ్యాన్ ముందు నిలిచానని రియా వెల్లడించారు.
ప్రాణత్యాగానికైనా సిద్ధమే
ఒక్క వీడియోతో దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం ఊహించలేదని ఆమె అన్నారు. తనను స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చడం సరైంది కాదని, తాను కేవలం పౌరురాలిగా తన హక్కును వినియోగించుకున్నానని చెప్పారు. అయితే ఆ రోజు అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని ఆమె వ్యాఖ్యానించడం ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో రియా అహిర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు పోలీస్ వాహనం ముందు నిలబడటం ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు. అయితే NEET పేపర్ లీక్ వివాదంలో రియా అహిర్ మాత్రం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ముఖంగా మారిపోయారు.




















