మెగా డీఎస్సీ వివాదం ఢిల్లీకి.. ఉభయ సభల్లో వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్సార్‌సీపీ

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ఈ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు లోక్‌సభ, రాజ్యసభల్లో వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టింది.

23 జులై, 2026 3:49 PM•ByJanavaani Admin

Share this article

మెగా డీఎస్సీ వివాదం ఢిల్లీకి.. ఉభయ సభల్లో వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్సార్‌సీపీ

న్యూఢిల్లీ , జూలై 23: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రస్తావిస్తూ ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలకు నోటీసులు ఇచ్చింది.

లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎం. గురుమూర్తి, రాజ్యసభలో పార్టీ పార్లమెంటరీ నేత వై.వి. సుబ్బారెడ్డి వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టారు. రాజ్యసభలో రూల్–267 కింద నోటీసు ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి.. మెగా డీఎస్సీ–2025లో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలు దాదాపు 3.5 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టాయని పేర్కొన్నారు.

22.79 లక్షల మంది అభ్యర్థులకు సంబంధించిన నీట్ పరీక్ష అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరిగినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది టీచర్ అభ్యర్థులకు సంబంధించిన డీఎస్సీ వ్యవహారంపై కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో పాటు ప్రభుత్వ నియామక వ్యవస్థ విశ్వసనీయతకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు.

మెగా డీఎస్సీ నిర్వహణలో గోప్యంగా ఉండాల్సిన పరీక్షా ప్రక్రియను ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడం, మెరిట్ జాబితాలు, రోస్టర్ వివరాలను ప్రకటించకపోవడం, సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం కూడా అభ్యర్థులను తొలగించడం, స్పోర్ట్స్ కోటా నిబంధనల్లో మార్పులు, ప్రశ్నపత్రాల లీకేజీ, డబ్బులకు ఉద్యోగాల ఆరోపణలు, నియామకాల్లో అవకతవకలు వంటి అంశాలు అభ్యర్థుల విశ్వాసాన్ని దెబ్బతీశాయని వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆరోపించారు.

ఈ వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో నిర్దిష్ట గడువులో విచారణ చేపట్టాలని, డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, నిష్పక్షపాతాన్ని కాపాడేలా సంస్కరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ కోరింది.

ఈ అంశం ప్రజా ప్రాధాన్యం కలిగినదని, అందుకే పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చినట్లు పార్టీ ఎంపీలు తెలిపారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు