హైదరాబాద్, సెప్టెంబర్ 19 (జనవాణి): జన్వాడ ఫార్మ్ హౌస్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఫార్మ్ హౌస్‌ను రాజకీయ పార్టీల నేతలు పరిశీలించనున్నారన్న ప్రచారం నేపథ్యంలో యజమాని ప్రదీప్ రెడ్డి స్పందించారు. జన్వాడ ఫార్మ్ హౌస్ ఉన్న భూమి తన సొంతమని, ఆ భూమితో కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిన్ననాటి స్నేహితులమని ప్రదీప్ రెడ్డి తెలిపారు. తన సొంత ప్రాపర్టీ అయిన జన్వాడ ఫార్మ్ హౌస్‌ను కేటీఆర్‌కు లీజుకు ఇచ్చినట్లు వెల్లడించారు.
భూములకు లీగల్‌గా క్లియర్ టైటిల్ ఉందని వెల్లడి
జన్వాడ ఫార్మ్ హౌస్ భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేవని ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు. భూములకు లీగల్‌గా క్లియర్ టైటిల్ ఉందని తెలిపారు. ప్రభుత్వానికి లేదా సంబంధిత అధికారులకు ఏవైనా అనుమానాలు ఉంటే తనకు నోటీసులు జారీ చేసి వివరణ కోరవచ్చని అన్నారు.
అధికారుల విచారణకు సహకరిస్తా
ప్రభుత్వ అధికారులు ఏవైనా వివరాలు లేదా పత్రాలు కోరితే చట్టపరమైన విధానంలో వాటిని సమర్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రదీప్ రెడ్డి చెప్పారు. అయితే రాజకీయ పార్టీల నేతలు వ్యక్తిగత ఆస్తిని పరిశీలిస్తామంటూ రాజకీయ వివాదానికి తెరతీయడం సరికాదని అన్నారు. ప్రభుత్వానికి ఏమైనా సందేహాలు ఉంటే తనను సంప్రదించవచ్చని, అవసరమైతే నోటీసులు ఇవ్వవచ్చని తెలిపారు. చట్టపరమైన ప్రక్రియకు తాను పూర్తిగా సహకరిస్తానని ప్రదీప్ రెడ్డి స్పష్టం చేశారు.




















