సియం సర్ మీ సన్నిహితుడు నన్ను గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నాడు...సీఎం రేవంత్ రెడ్డికి శోభా రెడ్డి కీలక విజ్ఞప్తి

అడ్వర్టైజింగ్ రంగంలో వర్క్‌ ఆపర్చునిటీ, కాంట్రాక్ట్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తనను గెస్ట్‌హౌస్‌కు రావాలని పిలిచి దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించిన మహిళా వ్యాపారవేత్త కె. శోభా రెడ్డి మరోసారి స్పందించారు. తనను రాజకీయ పార్టీలకు అంటగడుతూ ‘పెయిడ్ ఆర్టిస్ట్’, ‘పేటీఎం బ్యాచ్’ అంటూ ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేస్తూ.. మున్సిపల్ శాఖలో అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుంచేందుకు ఒక్క అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరారు.

21 సెప్టెంబర్, 2026 12:07 PM•ByNarender Kumar Nangunoori

Share this article

సియం సర్ మీ సన్నిహితుడు నన్ను గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నాడు...సీఎం రేవంత్ రెడ్డికి శోభా రెడ్డి కీలక విజ్ఞప్తి

సీఎం సర్ ప్లీజ్ హెల్ప్ (AI Image)

హైదరాబాద్,సెప్టెంబర్ 21 (జనవాణి): అడ్వర్టైజింగ్ రంగంలో కాంట్రాక్ట్, వర్క్ ఆపర్చునిటీ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తన పట్ల ఓ వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడంటూ ఆరోపణలు చేసిన మహిళా వ్యాపారవేత్త కె. శోభా రెడ్డి మరోసారి స్పందించారు. తన ఆవేదనను ఎక్స్‌ వేదికగా వెల్లడించిన అనంతరం వచ్చిన విమర్శలు, రాజకీయ ఆరోపణలపై శనివారం రాత్రి వీడియో సందేశం ద్వారా వివరణ ఇచ్చారు.

‘నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు’

తనకు జరిగిన అవమానంపై మాట్లాడితే కొందరు కావాలనే రాజకీయ పార్టీలతో తనను ముడిపెడుతున్నారని శోభా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనను ‘పెయిడ్ ఆర్టిస్ట్’, ‘పేటీఎం బ్యాచ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారని తెలిపారు. ఒక మహిళ సమస్యను బయటకు తీసుకొచ్చినప్పుడు ఆమెకు ఏ పార్టీతో సంబంధం ఉందనే దానికంటే.. సమస్యలో నిజానిజాలను తెలుసుకుని న్యాయం చేయడంపై దృష్టి పెట్టాలని కోరారు.

రెండేళ్లుగా వర్క్ ఆపర్చునిటీ కోసం ప్రయత్నం

అడ్వర్టైజింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న తాను వృత్తిపరంగా ఎదగాలనే ఉద్దేశంతో వర్క్ ఆపర్చునిటీ కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలను సంప్రదించినట్లు శోభా రెడ్డి తెలిపారు. సీఎం పరిధిలోని అంశం కావడంతో ముఖ్యమంత్రిని సంప్రదించాలని సూచించారని చెప్పారు. సచివాలయానికి వెళ్లినా సంబంధిత అంతస్తుకు అనుమతి లభించలేదని, మున్సిపల్ శాఖలో పలుమార్లు వినతులు ఇచ్చినా స్పందన రాలేదని పేర్కొన్నారు.

ఫహీమ్ ఖురేషీ, రోహిన్ రెడ్డి, బల్మూర్ వెంకట్‌లను కూడా సంప్రదించినట్లు ఆమె వెల్లడించారు. సమయం వచ్చినప్పుడు అవకాశం ఇస్తామని వారు చెప్పారని, అయితే రెండేళ్లుగా ఫాలోఅప్ చేస్తున్నా ఫలితం లేకపోవడంతో మరో వ్యక్తిని సంప్రదించానని తెలిపారు. ఆ వ్యక్తి తనతో దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించారు.

‘ఆ వ్యక్తిని బయటపెట్టాలని నా ఉద్దేశం కాదు’

తన పట్ల దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిని బహిరంగంగా ఎక్స్‌పోజ్ చేయడం తన ఉద్దేశం కాదని శోభా రెడ్డి స్పష్టం చేశారు. తాను ఎవరినీ నిందించాలని కోరుకోవడం లేదని, తనకు కూడా ఎలాంటి అపవాదు రావాలని కోరుకోవడం లేదని చెప్పారు. తన సమస్యకు పరిష్కారం చూపాలని మాత్రమే కోరుతున్నానన్నారు.

మున్సిపల్ శాఖపై సంచలన వ్యాఖ్యలు

మున్సిపల్ శాఖలో అనేక సమస్యలు ఉన్నాయని శోభా రెడ్డి ఆరోపించారు. ఈ శాఖలో అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నానని తెలిపారు. తాను మాట్లాడే ప్రతి అంశానికి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.

‘సీఎం సార్.. ఒక్క అపాయింట్‌మెంట్ ఇవ్వండి’

జనగామ జిల్లా పాలకుర్తి ప్రాంతం నుంచి వచ్చిన తాను కుటుంబ బాధ్యతలు, మహిళల సమస్యలు తెలిసిన వ్యక్తినని శోభా రెడ్డి తెలిపారు. తన సమస్యను రాజకీయ కోణంలో చూడకుండా, అసలు విషయం ఏమిటో తెలుసుకుని పరిష్కరించాలని కోరారు. తనకు ఇప్పటికీ భయం ఉందని, తనను కూడా టార్గెట్ చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలను ముఖ్యమంత్రి ముందు ఉంచేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ‘ఉమెన్ డిగ్నిటీని కాపాడండి పార్టీలతో ముడిపెట్టొద్దు’ అంటూ శోభా రెడ్డి విజ్ఞప్తి చేశారు. తనపై వస్తున్న ఊహాగానాలను పక్కనపెట్టి, సమస్యపై దృష్టి పెట్టాలని కోరారు.

గమనిక: పై కథనంలోని ఆరోపణలు శోభా రెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. సంబంధిత వ్యక్తులు లేదా అధికారులు ఇచ్చే వివరణలు అందుబాటులోకి వస్తే అవి కూడా పాఠకులకు తెలియజేయాల్సి ఉంటుంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు