హైదరాబాద్, ఆగస్టు 1: సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం సమావేశమయ్యారు. గౌరవెల్లి, పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మ సాగర్ సాగునీటి ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా న్యాయపోరాటం చేయడం వల్లే ఈ అనుకూల తీర్పు వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపడమే కాకుండా, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి సహా న్యాయ నిపుణులను నియమించి సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించారని పేర్కొన్నారు.
గౌరవెల్లి, పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మ సాగర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టుల అమలుకు ఈ తీర్పు కొత్త ఊపునిస్తుందని మంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి అవసరాలు కూడా తీరుతాయని, రైతులతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇవి ఎంతో దోహదపడతాయని తెలిపారు. తెలంగాణ హక్కులను పరిరక్షించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవ, రాష్ట్ర ప్రభుత్వం చేసిన న్యాయపోరాటం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు.




















