దేశంలో అశాంతికి విదేశీ శక్తులతో కాంగ్రెస్ కుట్ర: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు

హైదరాబాద్ (తెలంగాణ): దేశంలో అశాంతి, అలజడి సృష్టించి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని బలహీనపర్చేందుకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు విదేశీ విచ్ఛిన్నకర శక్తులతో కలిసి కుట్ర చేస్తున్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు

23 జులై, 2026 3:44 PM•ByGovardhan Reddy

Share this article

దేశంలో అశాంతికి విదేశీ శక్తులతో కాంగ్రెస్ కుట్ర: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు

హైదరాబాద్ , జూలై 23: దేశంలో అశాంతి నెలకొల్పి యువతను రెచ్చగొట్టడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్, వామపక్ష పార్టీలు విదేశీ విచ్ఛిన్నకర శక్తులతో కలిసి కుట్ర పన్నుతున్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ తరహాలో భారతదేశంలో కూడా అశాంతి సృష్టించేందుకు కొన్ని అల్ట్రా-లెఫ్ట్, సాఫ్ట్-లెఫ్ట్ సంస్థలు కొత్త పేర్లతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని అన్నారు. పుణే, ముంబై, హైదరాబాద్, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన కార్యక్రమాల వెనుక దేశ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందని ఆరోపించారు.

ఈ ఉద్యమాలకు ఖలిస్తానీ అనుకూల శక్తులతో పాటు కతార్, కెనడా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఆర్థిక, వ్యూహాత్మక మద్దతు అందుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. రాహుల్ గాంధీపై కూడా విమర్శలు చేస్తూ ఖలిస్తానీ శక్తులతో కాంగ్రెస్ సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.

నీట్‌పై కేంద్రం వెంటనే స్పందించిందన్న బీజేపీ

నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై స్పందిస్తూ, విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి 31 మందిని అరెస్ట్ చేసిందని రాంచందర్ రావు తెలిపారు. విద్యార్థులకు అన్యాయం జరగకుండా రీ-ఎగ్జామ్స్ నిర్వహించామని, పరీక్షల వ్యవస్థలో పారదర్శకత కోసం కేంద్రం కఠిన చర్యలు తీసుకుందని చెప్పారు.

2024లో 'ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్' అమల్లోకి తీసుకువచ్చి పేపర్ లీకేజీలపై కఠిన శిక్షలు, భారీ జరిమానాల నిబంధనలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో కూడా పలు సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు.

యూపీఏ హయాంలోనే ఎక్కువ లీకేజీలు జరిగాయని ఆరోపణ

2014కు ముందు యూపీఏ ప్రభుత్వ హయాంలోనే సీబీఎస్‌ఈ, ఎయిమ్స్, ఆర్ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్ తదితర జాతీయ స్థాయి పరీక్షల్లో అనేక పేపర్ లీకేజీలు జరిగాయని రాంచందర్ రావు ఆరోపించారు. ఆ సమయంలో విద్యాశాఖ మంత్రులు ఎవరైనా రాజీనామా చేశారా అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు.

ఉద్యోగాలపై కేంద్రం గణాంకాలు

2004-2014 మధ్య యూపీఏ ప్రభుత్వం 2.9 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పించగా, 2014-2024 మధ్య మోదీ ప్రభుత్వం 17 కోట్ల ఉద్యోగ అవకాశాలు సృష్టించిందని రాంచందర్ రావు తెలిపారు. ఇప్పటివరకు 12 లక్షలకు పైగా నియామక పత్రాలు అందజేశామని, రోజ్‌గార్ మేళాల ద్వారా నియామక ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.

2017-18లో 6 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు ప్రస్తుతం 3.1 శాతానికి తగ్గిందని, ఉపాధి రేటు కూడా గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, ఎన్‌ఐటీలు, మెడికల్ కళాశాలల సంఖ్య పెంచడంతో పాటు ఉన్నత విద్యలో విద్యార్థుల నమోదు కూడా పెరిగిందని వివరించారు.

కాంగ్రెస్‌కు హెచ్చరిక

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు దేశ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని రాంచందర్ రావు హెచ్చరించారు. విదేశీ నిధులతో దేశంలో అశాంతి సృష్టించే ప్రయత్నాలను భారతీయ యువత తిప్పికొడుతుందని, దేశ అభివృద్ధిలో యువత భాగస్వాములు అవుతారని ఆయన అన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు