లాగ్‌బుక్ ఓపెన్ చేయగానే షాక్.. రైతులకు కరెంట్, తాగునీటిపై హరీశ్‌రావు ఫైర్!

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని సోలేపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి సబ్‌స్టేషన్‌ను సందర్శించిన ఆయన, లాగ్‌బుక్‌ను పరిశీలించి రైతులకు విద్యుత్ సరఫరాపై అధికారులను ప్రశ్నించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

24 జులై, 2026 6:49 PM•ByGovardhan Reddy

Share this article

లాగ్‌బుక్ ఓపెన్ చేయగానే షాక్.. రైతులకు కరెంట్, తాగునీటిపై హరీశ్‌రావు ఫైర్!

యాదాద్రి భువనగిరి: ఆలేరు నియోజకవర్గంలోని బొమ్మలరామారం మండలం సోలేపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి సబ్‌స్టేషన్‌ను సందర్శించిన ఆయన, విద్యుత్ సరఫరా రికార్డులు, లాగ్‌బుక్‌ను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

తనిఖీ అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు.. రాష్ట్రంలో రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందడం లేదని ఆరోపించారు. సబ్‌స్టేషన్ సిబ్బందితో మాట్లాడగా, ఇటీవల వరకు 14–15 గంటల పాటు విద్యుత్ సరఫరా జరిగేదని, ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు 12 గంటలకే పరిమితం చేస్తున్నట్లు చెప్పారని పేర్కొన్నారు. ఆ 12 గంటల సరఫరాలో కూడా పలుమార్లు ట్రిప్పింగ్ సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు.

రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు, విద్యుత్ రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించామని, ప్రస్తుతం ఆ వ్యవస్థను కొనసాగించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

బొమ్మలరామారం పర్యటనలో మహిళలు రెండు రోజులకు ఒకసారి మాత్రమే తాగునీరు వస్తోందని తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. సంగారెడ్డి, నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్, కామారెడ్డి, యాదాద్రి, నల్గొండ, మహబూబ్‌నగర్ సహా పలు జిల్లాల్లో తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రైతులు విద్యుత్ కోతలపై సబ్‌స్టేషన్ల ఎదుట ఆందోళనలు చేపడుతున్నారని, ఈ పరిస్థితికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని చెబుతున్నప్పటికీ, తాము పరిశీలించిన రికార్డుల్లో 12 గంటల సరఫరానే నమోదైందని పేర్కొన్నారు.

అలాగే యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయిందని ఆరోపించిన హరీశ్‌రావు, బొగ్గు నిల్వల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని అన్నారు. వెంటనే నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించి రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.

మిషన్ భగీరథ పనితీరుపై ప్రభుత్వం అత్యవసర సమీక్ష నిర్వహించి ప్రతిరోజూ ప్రజలకు తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు బీమా అమలులో కూడా తీవ్ర జాప్యం జరుగుతోందని, బొమ్మలరామారం మండలంలోనే పది రైతు బీమా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వ్యవసాయ అధికారులు తెలిపారని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతు కుటుంబాలకు రైతు బీమా నిధులు నెలలుగా అందలేదని ఆరోపించిన హరీశ్‌రావు, చనిపోయిన రైతుల కుటుంబాలకు తక్షణమే రూ.5 లక్షల బీమా సాయం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు