హైదరాబాద్, ఆగస్టు 9 (జనవాణి):
ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డా. ఎంసీఆర్ టిమ్స్) సిద్ధంగా ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఆస్పత్రిని త్వరలోనే ప్రజలకు అంకితం చేయనున్నట్లు వెల్లడించారు.
శనివారం మంత్రి దామోదర్ రాజనర్సింహ డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌ను సందర్శించి ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. హాస్పిటల్‌లోని ఏ, బీ, సీ బ్లాకులను పరిశీలించిన ఆయన వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందితో మాట్లాడి సేవల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు.
హాస్పిటల్ ప్రారంభానికి ముందు పూర్తి చేయాల్సిన మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆరోగ్యశాఖ, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రారంభమైన తొలి రోజు నుంచే రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేలా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.
వైద్య సేవలు, మౌలిక వసతులు, డాక్టర్లు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్యం, భద్రత, ఫైర్ సేఫ్టీ వంటి అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రతి విభాగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, అవసరమైన మానవ వనరులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌ను రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. అత్యాధునిక వైద్య పరికరాలు, సూపర్ స్పెషాలిటీ విభాగాలు, క్రిటికల్ కేర్, అత్యవసర వైద్యం, అవయవ మార్పిడి వంటి క్లిష్టమైన వైద్య సేవలను ఒకే చోట అందించేలా టిమ్స్‌ను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా టిమ్స్‌ను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. టిమ్స్ పూర్తిస్థాయిలో సేవలు ప్రారంభించిన తర్వాత హైదరాబాద్‌లోని ఇతర ప్రభుత్వ ఆస్పత్రులపై రోగుల భారం తగ్గడంతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్యం అవసరమైన వారికి మరిన్ని అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
"డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ ప్రజలకు నాణ్యమైన, అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉంది. మిగిలిన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలోనే ప్రారంభిస్తాం. తొలి రోజు నుంచే అత్యుత్తమ వైద్య సేవలు అందేలా అన్ని విభాగాలను సిద్ధం చేస్తున్నాం" అని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఎంసీఆర్ టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, ఆరోగ్యశాఖ, ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Loading Tweet...




















