‘బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు’.. కొండా ఫ్యామిలీపై ఎమ్మెల్యే నాయిని ఘాటు విమర్శలు

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌లో విభేదాలు ముదురుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. కొండా సురేఖపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొండా కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

22 ఆగస్టు, 2026 1:11 PM•ByNarender Kumar Nangunoori

Share this article

‘బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు’.. కొండా ఫ్యామిలీపై ఎమ్మెల్యే నాయిని ఘాటు విమర్శలు

AI Image

హన్మకొండ, ఆగస్టు 22 (జనవాణి): మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ దుమారం రేపుతున్నాయి. సుస్మిత వ్యాఖ్యలను పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కొండా సురేఖ తీరుపైనా ప్రశ్నలు సంధించారు. సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని కొండా సురేఖ చెబుతున్నారని, అయితే ఆమె వ్యాఖ్యలను ఎందుకు బహిరంగంగా ఖండించలేదని నేతలు ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొండా కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. తుపాకీ రాముడు అయినా కొంచెం మంచిగా మాట్లాడతాడు... పీసీసీ అధ్యక్షుడిని మేమె చేసాం, ముఖ్యమంత్రిని మేమె చేసాం అని అంటున్నారు. అసలు ఏంటిది మీరు చేసింది? అంటూ ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 చోట్ల కాంగ్రెస్‌కు మెజారిటీ వచ్చిందని నాయిని తెలిపారు. అయితే కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మాత్రమే మెజారిటీ ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు.

సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని చెబుతున్న కొండా సురేఖ.. ఆమెతో కలిసి ఉన్న కార్యక్రమాలు, బ్యానర్లు, కేక్ కట్ చేసిన అంశాలపై కూడా నాయిని ప్రశ్నలు సంధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేతో అయినా కొండా కుటుంబం సఖ్యతగా ఉందా? అని నిలదీశారు. కొండా కుటుంబం రాజకీయాల్లో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందని నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. అనేక పార్టీలు మారినప్పటికీ ఏ పార్టీలోనూ వారు సఖ్యతగా లేరని విమర్శించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఇకపై చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కొండా సురేఖకు మంత్రి పదవి ఇస్తే ఇచ్చే గౌరవం ఇదేనా? అధిష్టానం ఇలాంటి వాటిని క్షమించకూడదు. మాకు కూడా ఓపిక నశించిపోయింది అని నాయిని అన్నారు.

కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను ఆసరాగా చేసుకుని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్‌పై విష ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ పరిణామాల వెనుక బీజేపీ, బీఆర్ఎస్ ఉండొచ్చని, లేదంటే కాంగ్రెస్‌లోని కొందరు నేతలే కుట్ర చేస్తున్నారనే అనుమానం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ కార్యకర్తలను, పార్టీ నాయకులను బద్నాం చేస్తే సహించేది లేదని నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. ఇలాంటి వ్యవహారాలపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు