జనవాణి: హైదరాబాద్ August 13: తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) ప్రతినిధి బృందం గురువారం ఉదయం రాష్ట్ర శక్తి, , ఉపాధి కల్పన మరియు గనుల శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసింది. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల శ్రీకాంత్, హైదరాబాద్ జిల్లా కోశాధికారి శ్యామ్ సుందర్ నేతృత్వంలో ప్రతినిధులు మంత్రిని కలిసి సీపీఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా సీపీఎస్ రద్దు చేయాల్సిన అవసరాన్ని వివరిస్తూ మంత్రికి వినతిపత్రం సమర్పించారు.
రూ.20 వేల కోట్ల పెన్షన్ నిధులపై ఉద్యోగుల ఆవేదన
గత 22 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల నుంచి సీపీఎస్ కింద సేకరించిన సొమ్ములో దాదాపు రూ.20 వేల కోట్లు షేర్ మార్కెట్‌లో ఉన్నాయని యూనియన్ ప్రతినిధులు మంత్రికి వివరించారు. సీపీఎస్ విధానంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (OPS) తరహాలో కనీసం రూ.9,500 పెన్షన్ కూడా అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 5,000 మందికి పైగా ఉద్యోగులు రిటైర్ అయ్యారని తెలిపారు.
సీపీఎస్ రద్దుతో ప్రభుత్వానికి భారం ఉండబోదన్న యూనియన్ ప్రతినిదులు
సీపీఎస్‌ను రద్దు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం ఉండదని యూనియన్ నాయకులు మంత్రికి వివరించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం పెన్షన్ నిధిలో ఉన్న మొత్తంలో ప్రభుత్వ వాటాను ప్రజా అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు.
క్యాబినెట్‌లో చర్చిస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
ఉద్యోగ సంఘం ప్రతినిధులు వివరించిన అంశాలను మంత్రి వివేక్ వెంకటస్వామి సానుకూలంగా విన్నారని ప్రకటన తెలిపింది. రేపు జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో సీపీఎస్ విధానంపై తప్పకుండా చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా ప్రత్యేకంగా తీసుకెళ్తానని మంత్రి చెప్పినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ఉద్యోగులకు న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఉద్యోగుల్లో హర్షం
సీపీఎస్ అంశాన్ని క్యాబినెట్‌లో చర్చిస్తామని మంత్రి హామీ ఇవ్వడంపై ఉద్యోగ సంఘం నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు న్యాయం జరిగే దిశగా తనవంతు కృషి చేస్తానని మంత్రివర్యులు భరోసా ఇచ్చారు. మంత్రి గారి సానుకూల స్పందన, ఇచ్చిన హామీ పట్ల సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.




















