హైదరాబాద్ జులై 29: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం స్ఫూర్తితో తెలంగాణలో నిరుద్యోగ యువత కొత్త రాజకీయ వేదికను ప్రకటించింది. 'తెలంగాణ ఎండ్రిన్ పార్టీ' పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు నిరుద్యోగ జేఏసీ, పోలీస్ జేఏసీ నాయకులు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ నిర్ణయానికి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే కారణమని నాయకులు తెలిపారు. "మీరు ఒర్లినా, పొర్లుదండాలు పెట్టినా.. ఎండ్రిన్ తాగి బావిలో దూకినా పోలీస్ ఉద్యోగాలు పెంచడం సాధ్యం కాదు" అని సీఎం చేసిన వ్యాఖ్యల తర్వాత నిరుద్యోగుల సమస్యలను రాజకీయ వేదికపై బలంగా వినిపించాలనే ఉద్దేశంతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ ఎండ్రిన్ పార్టీ ప్రధాన డిమాండ్లు
రాష్ట్ర ప్రభుత్వం ముందు పార్టీ పలు కీలక డిమాండ్లను ఉంచింది.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి.
ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి.
20 వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలి.
మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి.
గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 నియామక ప్రక్రియను వేగవంతం చేయాలి.
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను పారదర్శకంగా, జాబ్ క్యాలెండర్ ప్రకారం చేపట్టాలి.
సూర్యాపేటలో ఆవిర్భావ సభ
పార్టీని ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేసిన అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలో అధికారిక ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. మారోజు వీరన్న స్థూపం వద్ద పార్టీ లోగోను ఆవిష్కరించి తొలి బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు.
పార్టీ ప్రధాన ప్రతినిధులుగా నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రానాయక్, ఆకాశ్ నవీన్ పట్నాయక్, శంకర్, కుమార్ నాయక్, శింబు, వంశీ, చెర్రి ప్రవీణ్, సోమేశ్, జీ ప్రవీణ్ వ్యవహరించనున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రకటించారు.
గమనిక: ప్రస్తుతం 'తెలంగాణ ఎండ్రిన్ పార్టీ' ఏర్పాటుకు సంబంధించిన ప్రకటనను నిరుద్యోగ జేఏసీ నాయకులు చేశారు. పార్టీ ఎన్నికల కమిషన్ వద్ద అధికారికంగా నమోదు కావాల్సి ఉంది.




















