గ్రామీణ రహదారులకు కొత్త రూపు.. 6,703 గ్రామాల్లో హ్యామ్ రోడ్ల పనులకు సీతక్క గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో గ్రామీణ రవాణా వ్యవస్థను ఆధునికీకరించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ద్వారా వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అధికారులను ఆదేశించారు.

25 జులై, 2026 10:09 PM•ByLaharika

Share this article

గ్రామీణ రహదారులకు కొత్త రూపు.. 6,703 గ్రామాల్లో హ్యామ్ రోడ్ల పనులకు సీతక్క గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా నాణ్యమైన రహదారులు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. ఈ లక్ష్యంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద చేపట్టిన గ్రామీణ రహదారి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

శనివారం సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, ఇంజినీరింగ్ ఉన్నతాధికారులతో కలిసి హ్యామ్ రోడ్ల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి గ్రామానికి నాణ్యమైన రోడ్డు అనుసంధానం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 6,703 గ్రామాల్లో మొత్తం 18,472 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.

తొలి విడతలో 2,678 గ్రామాల్లో 7,450 కిలోమీటర్ల రహదారుల విస్తరణ, ఆధునీకరణ పనులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ఇందులో దాదాపు 90 శాతం పనులు ఇప్పటికే ఉన్న రహదారులను మెరుగుపరచడానికేనని చెప్పారు.

దశాబ్దాలుగా సరైన రహదారి సౌకర్యం లేని 179 గ్రామాలకు తొలిసారిగా 934 కిలోమీటర్ల బీటీ, సీసీ రోడ్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో విద్య, వైద్యం, వ్యవసాయ, ఉపాధి అవకాశాలు మరింత అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ అమలు చేస్తున్న హ్యామ్ విధానాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తిగా పరిశీలిస్తున్నాయని పేర్కొన్న మంత్రి, అందుకే మార్గదర్శకాలను సమగ్రంగా రూపొందించినట్లు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి అవసరమైన అనుమతులు వచ్చే వారంలో పూర్తయ్యే అవకాశం ఉందని, ఆగస్టు 15 నాటికి అన్ని కాంట్రాక్ట్ ఒప్పందాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఒప్పందాలు పూర్తయిన వెంటనే కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించాలని, టెండర్లు దక్కించుకున్న ఉత్సాహంతోనే పనులను కూడా నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. గతంలో సింగిల్ రోడ్లు ఉన్న ప్రాంతాల్లో కూడా భారీ వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేలా ఆధునిక ప్రమాణాలతో రహదారులు నిర్మించాలని అన్నారు.

భూసేకరణ, చెట్ల తొలగింపు వంటి అంశాల్లో జాప్యం లేకుండా జిల్లా కలెక్టర్లకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు. నిర్మాణ సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని, అటవీ ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలను స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలని సూచించారు.

పనుల అమలులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని కాంట్రాక్టర్లకు మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. గ్రామీణ రవాణా వ్యవస్థలో ఈ ప్రాజెక్టు కీలక మార్పుకు దారి తీస్తుందని ఆమె పేర్కొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు

Seethakka Reviews HAM Rural Roads Project, 18,472 Km Road Network Planned Across Telangana: Latest Telugu News | Breaking News in Telugu | తెలుగు వార్తలు