ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డులు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఆగస్టు 15 నుంచి 1.05 కోట్ల కొత్త PDS రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది. సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించగా, అదే రోజు 119 నియోజకవర్గాల్లో కార్డుల పంపిణీ జరగనుంది.

6 ఆగస్టు, 2026 11:58 AM•ByLaharika

Share this article

ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డులు..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

హైదరాబాద్, ఆగస్టు 6 (జనవాణి): తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మంజూరైన 1.05 కోట్ల లామినేటెడ్ ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ కార్డులను ఆగస్టు 15 నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా.. అదే రోజు రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో కార్డుల పంపిణీ చేపట్టనున్నారు.

ఆగస్టు 15నే రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోందని నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారిక మెమో జారీ చేసినట్లు వెల్లడించారు. కొత్తగా అర్హత పొందిన కుటుంబాలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రయోజనాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

సంగారెడ్డి నుంచి సీఎం శ్రీకారం

కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించిన రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని సంగారెడ్డిలో నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లబ్ధిదారులకు కార్డులు అందించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గంలో రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ) సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ అధికారిక కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. లబ్ధిదారుల జాబితాల ఖరారు, రేషన్ కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాటు తదితర ప్రక్రియలను ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పంపిణీ కేంద్రాలకు వచ్చే ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు కార్యక్రమానికి సంబంధించిన మీడియా ప్రచారం, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఏర్పాట్లను కూడా పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.

ఆహార భద్రతే ప్రధాన లక్ష్యం

పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రయోజనాలను కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 119 నియోజకవర్గాల్లో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడం ద్వారా లబ్ధిదారులకు వేగంగా కార్డులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సంక్షేమ పాలనలో ఈ కార్యక్రమం మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు