హన్మకొండ, ఆగస్టు 6 (జనవాణి): తెలంగాణలోని సహజ వనరులతోనే రాష్ట్ర అభివృద్ధిని సాధించాలనే ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లిన మహనీయుడు ప్రొఫెసర్ కె. జయశంకర్ అని టీజీఎన్‌పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఆయన పరిశోధనలు, వ్యాసాలు, విశ్లేషణలు, దూరదృష్టితో కూడిన ఆలోచనలు బలమైన సిద్ధాంతపరమైన పునాదిని నిర్మించాయని కొనియాడారు.
ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి సందర్భంగా గురువారం హన్మకొండ నక్కలగుట్టలోని టీజీఎన్‌పీడీసీఎల్ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలు, ప్రాంతీయ అసమానతలు, వనరుల దోపిడీని శాస్త్రీయంగా విశ్లేషించి ప్రజల్లో చైతన్యం కల్పించడంలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన అందించిన సిద్ధాంత బలం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనా విధానం, దూరదృష్టి, సమాజం పట్ల ఉన్న నిబద్ధత ప్రతి ఒక్కరికీ ఆదర్శమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక్కరి కృషి కాదని, అనేక మంది మేధావులు, ఉద్యమకారులు, విద్యుత్ అధికారులు కలిసి సాగించిన సమిష్టి ప్రయాణమని వివరించారు.
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాంతాలు, సంస్థానాలు, భిన్న సంస్కృతులను అధిగమించి "మనమంతా భారతీయులమే" అనే సమైక్య భావన ఏర్పడేందుకు మేధావుల కృషి ఎంతగానో దోహదపడిందని గుర్తు చేశారు. ప్రపంచ చరిత్రలో ఫ్రెంచ్ విప్లవం, జెకోస్లోవేకియా పరిణామాలు, ఈజిప్ట్, ఇరాక్ వంటి దేశాల్లో జరిగిన మార్పుల వెనుక కూడా మేధావుల భావజాల వ్యాప్తి కీలక పాత్ర పోషించిందని, తెలంగాణలో ఆ పాత్రను ప్రొఫెసర్ జయశంకర్ పోషించారని అన్నారు.
విద్యుత్ రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో ఉద్యోగులందరూ తమ హోదాతో సంబంధం లేకుండా భవిష్యత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి కొత్త ఆలోచనలు, సాంకేతిక ఆవిష్కరణలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఉద్యోగి అదనపు శ్రమ, సృజనాత్మకతను జోడిస్తే సంస్థ మరింత సమర్థవంతంగా ఎదగడమే కాకుండా సమాజాభివృద్ధికి కూడా విశేషంగా దోహదపడుతుందని పేర్కొన్నారు.
టీజీఎన్‌పీడీసీఎల్ వంటి ప్రజాసేవా సంస్థలు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వి. మోహన్ రావు, టి. మధుసూదన్, సి. ప్రభాకర్, సీవీవో బోనాల కిషన్, సీఎంలు అశోక్, మాధవరావు, కె. వెంకటరమణ, అన్నపూర్ణ, సురేందర్, నాగప్రసాద్, గౌతంరెడ్డి, సీఎజీఎంలు చరణ్ దాస్, కిషన్, వేణుబాబు, కంపెనీ సెక్రటరీ కె. వెంకటేశం, జాయింట్ సెక్రటరీ శ్రీకృష్ణ, జీఎంలు హేమంత్ కుమార్, గిరిధర్, కళాధర్, అనిల్ రెడ్డి, మధుసూదన్ రావు, వెంకటకృష్ణ, మల్లికార్జున్, శ్రీకాంత్, ప్రభావతి, శ్రీనివాస్ అమర్‌నాథ్, ఎస్‌ఈ (సివిల్) వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.




















