ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు.. సీపీ సజ్జనార్‌పై మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ అనంతరం సీపీ సజ్జనార్‌తో పాటు పలువురు పోలీసులపై మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్‌కౌంటర్ బెదిరింపులు, టార్చర్, నిబంధనల ఉల్లంఘనపై ఆరోపణలు చేశారు.

8 ఆగస్టు, 2026 1:26 PM•ByGovardhan Reddy

Share this article

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు.. సీపీ సజ్జనార్‌పై మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు

హైదరాబాద్, ఆగస్టు 8 (జనవాణి): ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తన కస్టడీ విచారణ అనంతరం సంచలన ఆరోపణలు చేస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌పై మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ సందర్భంగా సీపీ తన కుటుంబ సభ్యులను ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించారని, తనతో పాటు తన న్యాయవాదులను కూడా చంపేస్తామని హెచ్చరించారని మేజిస్ట్రేట్‌కు వివరించినట్లు సమాచారం.

అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కస్టడీ ముగిసిన అనంతరం పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని ఉప్పర్‌పల్లి కోర్టులోని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా కస్టడీలో తనపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, బూతులు తిట్టారని, నిబంధనలకు విరుద్ధంగా విచారణ నిర్వహించారని ఆయన ఆరోపించారు.

విచారణను సీసీటీవీ కెమెరాలు లేని ప్రాంతంలో నిర్వహించారని, టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి శారీరకంగా హింసించి కొట్టారని మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. విచారణలో పాల్గొన్న ప్రతి పోలీసు అధికారిపై ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.

కస్టడీ సమయంలో సీపీ సజ్జనార్ స్వయంగా విచారణకు వచ్చి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, 13 మంది తెలుగు ట్రైనీ ఐపీఎస్‌ల జీవితాలను కూడా నాశనం చేస్తామని బెదిరించినట్లు ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోపించారు. రిటైర్డ్ ఏసీపీ పూర్ణచందర్ రావు విచారణలో ఎలా పాల్గొన్నారంటూ ఆయన తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు.

విచారణ సందర్భంగా ఉదయ్ కృష్ణారెడ్డి భావోద్వేగానికి గురై మేజిస్ట్రేట్ ఎదుట బోరున విలపించినట్లు సమాచారం. అనంతరం మేజిస్ట్రేట్ కోర్టు మందిరంలో ఉన్న వారందరినీ బయటకు పంపించి ఆయన వాదనలు నమోదు చేశారు.

ఈ వ్యవహారంపై అత్తాపూర్ పోలీసులపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన మేజిస్ట్రేట్.. అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సీసీటీవీ కెమెరాలు లేని ప్రాంతంలో విచారణ ఎందుకు నిర్వహించారని ప్రశ్నిస్తూ రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే సీపీ సజ్జనార్‌తో పాటు విచారణలో పాల్గొన్న పోలీసులకు కూడా నోటీసులు ఇవ్వాలని ఉదయ్ కృష్ణారెడ్డి కోర్టును కోరారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు