అమరావతి, జూలై 22: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది.
ప్రధాని పర్యటన సందర్భంగా పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర ప్రజా అవసరాల పర్యవేక్షణ కోసం నలుగురు ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కమిషనర్ కేతన్ గార్గ్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ హెచ్.ఎం. ధ్యానచంద్ర, గుంటూరు మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్‌లను ఏర్పాట్ల పర్యవేక్షణకు నియమించారు.
వీరికి సహాయంగా రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి 26 మంది నాన్-క్యాడర్ అధికారులను కేటాయించారు. వీరంతా విజయనగరం జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తూ, కార్యక్రమ ఏర్పాట్లను సమన్వయం చేయాలని మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేపడుతోంది. భద్రతా ఏర్పాట్లతో పాటు కార్యక్రమ నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.




















