హైదరాబాద్, ఆగస్టు 10 (జనవాణి): ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) సూచించారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద ఈరోజు(సోమవారం) బండి సంజయ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్‌పై పలు సూచనలు చేశారు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి
దేశవ్యాప్తంగా ప్రారంభమైన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని తెలంగాణలోనూ విజయవంతం చేయాలని బండి సంజయ్ కోరారు. కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రతి భారతీయుడు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. విద్యార్థులు సైతం పెద్ద సంఖ్యలో భాగస్వాములై తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశంపై తమకున్న భక్తిభావాన్ని చాటుకోవడానికి ఇది సువర్ణావకాశమని పేర్కొన్నారు.
తిరంగా యాత్రలను విజయవంతం చేయాలి
‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తిరంగా యాత్రలను ఘనంగా నిర్వహించాలని బీజేపీ శ్రేణులను బండి సంజయ్ కోరారు. ప్రతి గ్రామంలో, ప్రతి కూడలిలో తిరంగా ర్యాలీలు, దేశభక్తి ప్రదర్శనలు, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. ప్రతి ఇంట్లో దేశభక్తి వాతావరణం కనిపించేలా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
ఆగస్టు 12 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు
స్వాతంత్య్ర దినోత్సవానికి ముందుగా ఆగస్టు 12 నుంచి 14వ తేదీ వరకు మహాపురుషులు, స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను శుద్ధి చేయాలని బండి సంజయ్ సూచించారు. అలాగే విగ్రహాలు, స్మారక చిహ్నాల పరిసరాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టాలని బీజేపీ శ్రేణులను కోరారు.
Loading Tweet...
ఐక్యతకు ప్రతీకగా త్రివర్ణ పతాకం
జాతీయ త్రివర్ణ పతాకం దేశ ప్రజల ఐక్యత, సమైక్యత, అఖండతకు ప్రతీక అని బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రతి పౌరుడిని మానసికంగా దేశంతో అనుసంధానించే ఒక గొప్ప సామాజిక ఉద్యమంగా ఈ కార్యక్రమం రూపాంతరం చెందిందని తెలిపారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. ఈసారి కూడా ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములై ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా పార్టీ కార్యకర్తలు బాధ్యతాయుతంగా పనిచేయాలని బండి సంజయ్ సూచించారు.




















