ప్రధాని మోదీపై వైరల్ వీడియోలు.. మెటాపై హైదరాబాద్‌లో కేసు.. అసలు ఏం జరిగింది?

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన మార్ఫింగ్, ఏఐ ఆధారిత వీడియోలు వైరల్ అయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో మెటా ఇండియాపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌తో పాటు పలు సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకులను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

31 జులై, 2026 2:16 PM•ByLaharika

Share this article

ప్రధాని మోదీపై వైరల్ వీడియోలు.. మెటాపై హైదరాబాద్‌లో కేసు.. అసలు ఏం జరిగింది?

ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన అభ్యంతరకర వీడియోలు, మార్ఫింగ్ రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మెటా ఇండియా, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోని పలు సోషల్ మీడియా ఖాతాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఫిర్యాదు ఎవరు చేశారు?

పోలీసుల వివరాల ప్రకారం, జూలై 29న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా కోర్ కమిటీ సభ్యుడు టీ. సాయికిరణ్ గౌడ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనల సందర్భంగా ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ వీడియోలు, రీల్స్, పోస్టులు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. ఫిర్యాదుతో పాటు దాదాపు 20 సోషల్ మీడియా లింకులను కూడా పోలీసులకు అందజేశారు.

ఆరోపణలేంటి ?

ఫిర్యాదులో పేర్కొన్న కంటెంట్ దేశ సమగ్రతకు విఘాతం కలిగించేలా ఉందని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని, విద్వేషాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తున్న వారిని గుర్తించాలని పోలీసులను కోరారు.

అలాగే ఖాతాల వివరాల కోసం మెటా సంస్థ సహకారం తీసుకుని దర్యాప్తు చేపట్టాలని, అభ్యంతరకర కంటెంట్ వ్యాప్తిని అడ్డుకోవడంలో విఫలమైందన్న ఆరోపణలపై మెటాపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఏ సెక్షన్ల కింద కేసు?

ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఐటీ చట్టంలోని సెక్షన్లు 66(C), 67తో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 353(2), 336(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును ఇన్‌స్పెక్టర్ పి. జయశంకర్ దర్యాప్తు చేస్తున్నారు.

మెటా ఇండియా హెడ్‌పై కూడా ఎఫ్‌ఐఆర్

ఈ కేసులో మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్ పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అయిన వీడియోలు ఏ సోషల్ మీడియా ఖాతాల నుంచి అప్‌లోడ్ అయ్యాయో, వాటి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

నీట్ నిరసనలతో వివాదం

నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసనల సందర్భంగా ప్రధాని మోదీకి సంబంధించిన పలు ఏఐ జనరేటెడ్ వీడియోలు, మార్ఫింగ్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటిని కేంద్ర ప్రభుత్వం గతంలోనే పలుమార్లు ఖండించింది.

గతంలోనూ మెటాపై కేంద్రం ఆగ్రహం

ఇటీవల విద్యార్థుల నిరసనలకు సంబంధించి ప్రధాని మోదీ పోస్టు చేసిన సెల్ఫీ వీడియోను ఫేస్‌బుక్ కొంతసేపు తొలగించడం వివాదానికి దారితీసింది. అనంతరం సాంకేతిక లోపం వల్లే అలా జరిగిందని మెటా క్షమాపణలు తెలిపింది. అయితే ఆ వివరణతో సంతృప్తి చెందని కేంద్ర ప్రభుత్వం మెటా ప్రతినిధులకు సమన్లు జారీ చేసినట్లు సమాచారం. ఈ అంశంపై మెటా ప్రతినిధులు కేంద్ర ఐటీ శాఖ అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు