'వన్ ఆఫీసర్-వన్ కార్'..కేంద్రం కీలక నిర్ణయం! బ్యూరోక్రాట్ల అదనపు వాహనాలకు చెక్

ఇకపై ఒకే అధికారి ఎంతటి అదనపు బాధ్యతలు నిర్వహించినా, ఒకే అధికారిక వాహనాన్ని మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారుల హోదాతో వచ్చే అనవసర విలాసాలకు, ప్రభుత్వ వనరుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా "వన్ ఆఫీసర్ – వన్ కార్" విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

29 జులై, 2026 2:06 PM•ByNarender Kumar Nangunoori

Share this article

'వన్ ఆఫీసర్-వన్ కార్'..కేంద్రం కీలక నిర్ణయం! బ్యూరోక్రాట్ల అదనపు వాహనాలకు చెక్

AI genarate

న్యూఢిల్లీ, జులై 29: ప్రభుత్వ అధికారుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక్క అధికారికి ఒక్కటే అధికారిక కారు అనే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ఖజానాపై అనవసర భారం తగ్గించడం, ప్రభుత్వ వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయాల విభాగం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, ఒక అధికారి తన అసలు శాఖతో పాటు మరో శాఖ, ప్రభుత్వ రంగ సంస్థ లేదా స్వయంప్రతిపత్తి సంస్థలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, రెండో అధికారిక వాహనం కేటాయించడానికి అవకాశం ఉండదు. ఇప్పటికే ప్రభుత్వ స్టాఫ్ కార్ సౌకర్యం పొందుతున్న అధికారులు అదే వాహనాన్ని అన్ని అధికారిక బాధ్యతలకు వినియోగించాల్సి ఉంటుంది. అదనపు బాధ్యతల పేరుతో కొత్త కారు మంజూరు చేయరాదని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు... కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ రంగ సంస్థలు, అటానమస్ బాడీలు లేదా ఇతర ప్రభుత్వ సంస్థలకు చెందిన వాహనాలను వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించకూడదని కూడా ఆదేశించింది. కేవలం అధికారిక విధులు, అధికారిక పర్యటనల సమయంలో మాత్రమే వాటిని వినియోగించాలి. వాడకంలో లేని ప్రభుత్వ వాహనాలను సంబంధిత శాఖలు భద్రంగా ఉంచాలని, వాటి దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని కేంద్రం సూచించింది.

ఈ మార్గదర్శకాలు 2022లో తీసుకొచ్చిన స్టాఫ్ కార్ నిబంధనలకు కొనసాగింపుగా జారీ అయ్యాయి. అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని వ్యయాల విభాగం స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.

ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం, ప్రజల పన్ను సొమ్మును మరింత సమర్థవంతంగా వినియోగించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు