హైదరాబాద్, ఆగస్టు 05 (జనవాణి): తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య గోదావరి జలాల వివాదం మరోసారి రాజకీయంగా వేడెక్కుతోంది. ఆగస్టు 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) సమావేశానికి ముందు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణకు చెందిన ఏడు కీలక ప్రాజెక్టులకు ఇప్పటికే లభించిన అనుమతులను పునఃసమీక్షించాలని, నిలిపివేయాలని ఏపీ ప్రతిపాదించిందని ఆయన పేర్కొన్నారు. ఇంత కీలకమైన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.
ఏడు ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలంటూ..
తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. GRMB సమావేశం ఎజెండాలోని అంశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాళేశ్వరం, చౌటుపల్లి హన్మంతరావు, చిన్న కాళేశ్వరం, చనాకా–కొరటా, మోదికుంట వాగు, కడెం గూడెం లిఫ్ట్, సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను నిలిపివేసి పునఃసమీక్షించాలని ఏపీ కోరుతోందని ఆయన వెల్లడించారు. సమ్మక్క బ్యారేజీ క్లియరెన్సులపైనా ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని ఏపీ కోరడం కాదని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన అనుమతులనే తిరిగి సమీక్షించాలని కోరడం అత్యంత తీవ్రమైన అంశమని హరీశ్ రావు అన్నారు.
‘383 టీఎంసీలకు అనుమతులు సాధించాం’
తెలంగాణ ఉద్యమం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం గోదావరి జలాల్లో 383 టీఎంసీల వినియోగానికి సంబంధించిన అనుమతులు సాధించిందని హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క టీఎంసీకి కూడా అనుమతి సాధించలేదని ఆరోపించారు. సమ్మక్క, పాలమూరు, వార్ధా ప్రాజెక్టుల DPRలు తిరిగి వచ్చాయని పేర్కొన్న ఆయన.. ఇప్పుడు గతంలో సాధించిన ఏడు ప్రాజెక్టుల అనుమతులే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
‘చంద్రబాబు మాట ఒకటి.. చేతలు మరొకటా?’
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాజెక్టులను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని చెబుతుంటారని, కానీ ఏప్రిల్ 24, 2026న తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కేంద్రానికి లేఖ రాశారని హరీశ్ రావు ఆరోపించారు. ఇప్పుడు అదే ప్రాజెక్టులపై GRMB ఎజెండాలో అభ్యంతరాలు రావడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యాఖ్యలకు, ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు పొంతన లేదని విమర్శించారు.
సమ్మక్క సాగర్‌పైనే అసలు ఫైట్?
GRMB ఎజెండాలో సమ్మక్క బ్యారేజీ అంశం అత్యంత కీలకంగా మారిందని హరీశ్ రావు పేర్కొన్నారు. సమ్మక్క ప్రాజెక్టుకు అనుమతి ఇస్తే పోలవరానికి నీటి లభ్యత తగ్గుతుందని ఏపీ వాదిస్తున్నట్లు చెప్పారు. సమ్మక్క సాగర్‌కు 2022 ఆగస్టు 25న 47 టీఎంసీల నీటి వినియోగానికి గత ప్రభుత్వం అనుమతులు సాధించిందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్‌ఎస్‌పీ స్టేజ్-2 పరిధిలో నాలుగు లక్షల ఎకరాలకు, రామప్ప–పాకాల పరిధిలో మరో 40 వేల ఎకరాలకు సాగునీటితో పాటు ములుగు, వరంగల్ ప్రాంతాలకు తాగునీరు అందించే ప్రతిపాదనలు ఉన్నాయని వివరించారు.
‘47 టీఎంసీలు వదులుకుంటారా?’
సమ్మక్క సాగర్‌కు సంబంధించిన 47 టీఎంసీల నీటి వాటాను వదులుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే ప్రాంతానికీ ప్రయోజనం ఉంటుందని, అలాంటి ప్రాజెక్టుపై అభ్యంతరాలు వస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
‘GRMBకి అనుమతులు రద్దు చేసే అధికారం ఉందా?’
కేంద్రంలోని సంబంధిత విభాగాల పరిశీలన తర్వాతే తెలంగాణ ప్రాజెక్టులకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (TAC) అనుమతులు ఇచ్చిందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఒకసారి కేంద్ర స్థాయిలో పరిశీలించి అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను తిరిగి సమీక్షించి రద్దు చేసే అధికారం GRMBకి ఎక్కడిదని ప్రశ్నించారు. దేశంలో గతంలో ఇలా అనుమతులు వచ్చిన ప్రాజెక్టులను తిరిగి రివ్యూ చేసి రద్దు చేసిన సందర్భాలున్నాయా అని నిలదీశారు.
‘968 టీఎంసీల హక్కుకే ఎసరు?’
తెలంగాణకు గోదావరిలో 968 టీఎంసీల కేటాయింపే లేదన్న వాదనను ఏపీ GRMB ఎజెండాలో ప్రస్తావించిందని హరీశ్ రావు ఆరోపించారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సమయంలో శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన నివేదికతో పాటు 9వ GRMB సమావేశం మినిట్స్‌లోనూ తెలంగాణకు 968 టీఎంసీల హక్కుకు సంబంధించిన అంశం నమోదై ఉందని ఆయన వాదించారు.
బనకచర్లపై ఎందుకు మౌనం?
గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుపైనా హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పుడు.. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని బీఆర్ఎస్ భావిస్తున్న ఏపీ ప్రాజెక్టులను GRMB ఎజెండాలో ఎందుకు చేర్చలేదని నిలదీశారు. బనకచర్ల విషయంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య ఏదైనా లోపాయికారి ఒప్పందం జరిగిందా అంటూ ఆరోపించారు. ‘సుజల సుఫలాం’ పేరుతో రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరిగే ఒప్పందాలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వాల స్పందన రావాల్సి ఉంది.
కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కూ ప్రశ్నలు
ఈ వ్యవహారంపై తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు స్పందించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో తమ వైఖరి ఏమిటో వెల్లడించాలని కోరారు. బీజేపీ స్పందించకపోతే తెలంగాణ నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
‘GRMB ఎజెండాను మార్చాలి’
తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపాదనలను GRMB ఎజెండా నుంచి తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ఎంపీలు కూడా ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని కోరారు. ఇది రాజకీయాల కోసం లేవనెత్తుతున్న అంశం కాదని, తెలంగాణ భవిష్యత్తు, నీటి హక్కులకు సంబంధించిన కీలక అంశమని పేర్కొన్నారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో మాజీ మంత్రులు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య తదితర బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.




















