హైదరాబాద్‌లో కల్తీ మసాలా మాఫియాపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. ముగ్గురు అరెస్ట్, 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు స్వాధీనం

హైదరాబాద్‌లో కల్తీ మసాలాల తయారీ కేంద్రాలపై H-FAST, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి 13 మసాలా ప్రాసెసింగ్, ట్రేడింగ్ యూనిట్లపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 25 టన్నుల విషపూరిత, రసాయనాలతో కల్తీ చేసిన మసాలా దినుసులను స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

4 ఆగస్టు, 2026 3:34 PM•ByNarender Kumar Nangunoori

Share this article

హైదరాబాద్‌లో కల్తీ మసాలా మాఫియాపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. ముగ్గురు అరెస్ట్, 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు స్వాధీనం

ప్రజారోగ్యాన్ని కాపాడే దిశగా హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిర్వహించిన అధికారులు కల్తీ మసాలా దినుసుల గుట్టును రట్టుచేశారు. H-FAST బృందం, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి నగరంలోని 13 మసాలా ప్రాసెసింగ్, ట్రేడింగ్ యూనిట్లపై సంయుక్తంగా దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సుమారు 25 టన్నుల రసాయనాలతో కల్తీ చేసిన విషపూరిత మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగించే ఈ కల్తీ ఉత్పత్తులను మార్కెట్‌లో విక్రయించేందుకు సిద్ధం చేసినట్లు అధికారులు గుర్తించారు. మైలార్‌దేవ్‌పల్లి, బాలాపూర్ పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు సహా పలు మసాలాల్లో కల్తీ చేసినట్లు గుర్తించామని తెలిపారు.

ఫ్యాబ్రిక్ డైలు, సింథటిక్ కలర్స్‌తో మసాలాల తయారీ చేస్తున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. టాల్కమ్ పౌడర్, ఇండస్ట్రీయల్ డైలు, రైస్ బ్రాన్ ఆయిల్ వినియోగిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. మసాలాలకు మెరుపు కోసం హానికర రసాయనాలను వినియోగిస్తున్నారని తెలిపారు. రంగులు వేసి నాణ్యమైన మసాలాల మాదిరిగా విక్రయిస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఈ కేసులో కాటేదాన్‌కు చెందిన రాహుల్ భాటి, బేగంబజార్‌కు చెందిన విశాల్ పన్వార్, దులీచంద్ కచ్‌ఛావర్ అనే ముగ్గురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం మూడు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. H- FAST ఏర్పడిన 140 రోజుల్లో 659 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించామని అన్నారు. 202 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 246 టన్నుల కల్తీ ఆహారం స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

ప్రమాదకర రసాయనాలతో కల్తీ చేసిన ఆహార పదార్థాల వినియోగం వల్ల తీవ్రమైన జీర్ణాశయ సమస్యలు, కాలేయం, మూత్రపిండాలు వంటి అవయవాలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని సీపీ సజ్జనార్ తెలిపారు. దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు. నగరవ్యాప్తంగా ఇలాంటి కల్తీ ఆహార ఉత్పత్తులపై తనిఖీలు, కఠిన చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు. ప్రజలు అనుమానాస్పద ఆహారంపై వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

▶CategoriesTelangana and News
▶Follow us onFacebook, Twitter & Instagram.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు