సంగారెడ్డి, జూలై 22: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంగాపూర్ గ్రామంలో జరిగిన చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. కేసు నమోదు చేసిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సంగాపూర్ గ్రామానికి చెందిన కాలిమొల్ల నాగేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూలై 21న రాయికోడ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. జూలై 18న గుర్తుతెలియని వ్యక్తి ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి సుమారు 20 తులాల వెండి పట్టీలు (రూ.11 వేల విలువ), శాంసంగ్ మొబైల్ ఫోన్ (రూ.25 వేల విలువ) చోరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసు నమోదు చేసిన ఎస్ఐ చైతన్య కిరణ్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక సమాచారం, ఇతర శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించారు. దర్యాప్తులో సంగాపూర్ గ్రామానికి చెందిన మడిగడ్డ బసవరాజ్ చోరీకి పాల్పడినట్లు గుర్తించి, కేసు నమోదు చేసిన 24 గంటల్లోనే అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. వేగంగా దర్యాప్తు పూర్తి చేసి కేసును ఛేదించిన రాయికోడ్ ఎస్ఐ చైతన్య కిరణ్‌తో పాటు పోలీసు సిబ్బందిని అభినందించారు. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.




















