సీఎం రేవంత్‌ చేతుల మీదుగా రేపే డా. ఎంసీఆర్ టిమ్స్ ప్రారంభం.. ఏర్పాట్లపై హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ సమీక్ష

రేపు సనత్‌నగర్‌లో డా. ఎంసీఆర్ టిమ్స్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్‌పై సమీక్ష నిర్వహించిన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ.

16 ఆగస్టు, 2026 6:20 PM•ByVijay Kumar

Share this article

సీఎం రేవంత్‌ చేతుల మీదుగా రేపే డా. ఎంసీఆర్ టిమ్స్ ప్రారంభం.. ఏర్పాట్లపై హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ సమీక్ష

జనవాణి: హైదరాబాద్ August 16: తెలంగాణ వైద్యరంగంలో కీలక అడుగుగా భావిస్తున్న సనత్‌నగర్‌లోని డా. ఎంసీఆర్ టిమ్స్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. సోమవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డా. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ ఆసుపత్రి ప్రాంగణంలో అధికారులకు సూచనలు చేశారు, ప్రారంభోత్సవ ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. విస్తృత ఏర్పాట్లు చేయాలని మరియు కార్యక్రమానికి వచ్చే ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, మీడియా ప్రతినిధులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.

ప్రాంగణంలో ఏర్పాట్ల పరిశీలన

ప్రారంభోత్సవ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన అనంతరం ఆరోగ్యశాఖ, పోలీస్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ, సమాచార పౌర సంబంధాల శాఖ, ట్రాఫిక్ పోలీస్ తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ సూచించారు.

ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలపై ప్రత్యేక దృష్టి

కార్యక్రమ వేదికతో పాటు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై సమీక్ష జరిగింది. ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధుల రాకపోకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు.

ప్రారంభోత్సవం కారణంగా సాధారణ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ముందస్తు ట్రాఫిక్ కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పార్కింగ్ ప్రాంతాలను కూడా ముందుగానే సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

భద్రతలో ఎలాంటి లోపాలకు తావులేకుండా..

ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, బందోబస్తు, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌తో పాటు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే వ్యవస్థలను ముందుగానే పరిశీలించాలని పోలీసు అధికారులకు సూచించారు.

పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌పై ఫోకస్

హాస్పిటల్ పరిసరాల్లో పారిశుధ్యం, పరిశుభ్రత విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి వచ్చే వారికి తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వైద్యరంగంలో కీలక మైలురాయి

డా. ఎంసీఆర్ టిమ్స్ ప్రారంభోత్సవం తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగంలో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనున్న ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఆరోగ్యశాఖతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. సమీక్ష సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, డా. ఎంసీఆర్ టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, ఐ&పీఆర్ కమిషనర్ ముకుంద రెడ్డి, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎండీ అశోక్ రెడ్డి, అదనపు డీసీపీ (ట్రాఫిక్) వేణుగోపాల్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు