లక్నో,సెప్టెంబర్ 12 (జనవాణి): భార్య తన ప్రియుడితో వెళ్లిపోయిందని తెలిస్తే సాధారణంగా భర్త ఆగ్రహంతో పోలీసులను ఆశ్రయించడం లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను వెతకడం చూస్తుంటాం. అయితే ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. తన భార్య తన ప్రియుడితో కలిసి ఉండాలని కోరుకుంటోందని తెలుసుకున్న భర్త.. చివరకు వారిద్దరికీ పెళ్లి జరిపించి పంపించాడు.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఓ పీఆర్డీ జవాన్ (PRD jawan)కు ఏడాది క్రితం ఓ యువతితో వివాహం జరిగింది. అయితే నాలుగు రోజుల క్రితం అతడి భార్య అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కోసం భర్తతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలో ఆమె హర్దోయ్ (Hardoi)లో తన ప్రియుడితో కలిసి ఉన్నట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లిన భర్త.. ఇద్దరితో మాట్లాడాడు. ఆ సమయంలో వారిద్దరూ గతంలో కలిసి చదువుకున్నారని, అప్పటి నుంచే ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని తెలిసింది. కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే తన భార్య తనను వివాహం చేసుకున్న విషయాన్ని కూడా భర్త తెలుసుకున్నాడు. పెళ్లి తర్వాత కూడా ఆమె తన ప్రియుడితో సంబంధాన్ని కొనసాగించినట్టు వెల్లడైంది. తనతో కలిసి జీవించేందుకు ఆమెకు ఆసక్తి లేదని గ్రహించిన భర్త ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.
తన భార్య తన ప్రియుడితోనే సంతోషంగా ఉంటుందని భావించిన అతడు.. కుటుంబ సభ్యులను ఒప్పించాడు. అనంతరం వారి సమక్షంలోనే తన భార్యకు ఆమె ప్రియుడితో వివాహం జరిపించాడు. అనంతరం వారిద్దరినీ కలిసి జీవించేందుకు పంపించాడు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. భర్త తీసుకున్న నిర్ణయంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు పరిస్థితిని అర్థం చేసుకుని అతడు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.




















