భారత్ ప్రభుత్వంతో మెటా సంస్థకు సంబంధించిన కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా సంస్థ కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. Child Sexual Abuse Material (CSAM), Deepfake Content, అలాగే ప్లాట్‌ఫామ్ నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలపై మెటా విచారం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, కొన్ని ప్రత్యేక రకాల కంటెంట్‌కు చెల్లింపులు తీసుకుని అధిక ప్రాధాన్యం (Boosting) కల్పించిన విషయాన్ని కూడా మెటా అంగీకరించినట్లు సమాచారం.
సేఫ్ హార్బర్ రక్షణపై ప్రభుత్వ స్పష్టత
ఈ వ్యవహారంలో మెటాను కేవలం సోషల్ మీడియా ఇంటర్మీడియరీగా పరిగణించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో భారత ఐటీ చట్టంలోని సెక్షన్-79 కింద లభించే సేఫ్ హార్బర్ (Safe Harbour) రక్షణ ఈ కేసులో వర్తించదని మెటాకు తెలియజేసినట్లు సమాచారం.
సేఫ్ హార్బర్ అంటే ఏమిటి?
ఐటీ చట్టం ప్రకారం సోషల్ మీడియా సంస్థలు కేవలం వినియోగదారులు పోస్ట్ చేసే కంటెంట్‌కు వేదికగా మాత్రమే వ్యవహరిస్తే, ఆ కంటెంట్‌కు నేరుగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదు. దీనినే 'సేఫ్ హార్బర్' రక్షణ అంటారు. అయితే ప్లాట్‌ఫామ్ నిర్వహణలో నిర్లక్ష్యం, చట్ట ఉల్లంఘనలు లేదా కంటెంట్‌ను ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహించినట్లు తేలితే ప్రభుత్వం ఈ రక్షణను తొలగించే అవకాశం ఉంటుంది.




















