ఒడిశాలోని ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్వహించిన పీజీ మెడికల్ (జనరల్ సర్జరీ) థియరీ పరీక్ష సందర్భంగా ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం వివాదానికి దారితీసింది.
2023–26 బ్యాచ్‌కు చెందిన జనరల్ సర్జరీ థియరీ పరీక్ష సోమవారం జరుగుతుండగా, ప్రశ్నాపత్రం ఫొటోలు వాట్సాప్‌లో షేర్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం వెలుగులోకి రావడంతో యూనివర్సిటీ అంతర్గత విచారణకు ఆదేశించింది.
పరీక్ష హాల్ నుంచే బయటకు?
ప్రాథమిక విచారణలో బెర్హంపూర్‌లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు పంపిణీ చేసిన కొద్ది నిమిషాల్లోనే వాటి ఫొటోలు సోషల్ మీడియాలోకి వెళ్లినట్లు అధికారులు గుర్తించినట్లు భారత మీడియా కథనాలు పేర్కొన్నాయి.
భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ విద్యార్థి వద్ద ఆ ఫొటోలు ఉండటంతో ఈ వ్యవహారం అధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం.
వైస్ ఛాన్సలర్ అత్యవసర సమావేశం
ఈ ఘటనపై ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ మనస్ రంజన్ సాహూ అన్ని మెడికల్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో అత్యవసర వర్చువల్ సమావేశం నిర్వహించారు. మిగిలిన పరీక్షల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.
"ఇది పేపర్ లీక్ కాదు"
ఎంకేసీజీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ హరేకృష్ణ దలాయ్ మాట్లాడుతూ, ఈ ఘటనను పేపర్ లీక్‌గా పరిగణించలేమని తెలిపారు. ప్రశ్నాపత్రం విద్యార్థుల చేతికి చేరకముందే బయటకు వచ్చి ఉంటే దాన్ని పేపర్ లీక్ అనేవాళ్లమని, కానీ ఈ ఘటనలో పరీక్ష ప్రారంభమైన తర్వాత పరీక్ష హాల్ నుంచే బయటకు వెళ్లిందని ఆయన వివరణ ఇచ్చారు.
జూలై 21 నుంచి ప్రారంభమైన ఈ పరీక్షల్లో బెర్హంపూర్ కేంద్రంలో 150 మందికి పైగా విద్యార్థులు హాజరవుతున్నారు. ఆగస్టు 1, ఆగస్టు 5 తేదీల్లో మరో రెండు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.
పరీక్షలపై పెరుగుతున్న ఆందోళన
దేశవ్యాప్తంగా పలు పోటీ పరీక్షల్లో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే పరీక్షా పత్రాల లీకేజీని అరికట్టేలా కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణలు తీసుకొచ్చింది. కఠిన శిక్షలు, రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయడం, తీవ్రమైన పరీక్షా నేరాల విచారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు వంటి నిబంధనలకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.




















